భూ స్కాం అయిపోయింది, ఇప్పుడు పవర్ స్కాం వంతు వచ్చిందట! హరీష్ రావు బయటపెట్టిన ఆ 50 వేల కోట్ల లెక్కలు చూస్తే దిమ్మతిరగాల్సిందే.
మాజీ మంత్రి హరీష్ రావు మరోసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మొన్నటి దాకా రూ. 5 లక్షల కోట్ల భూముల కుంభకోణంపై పోరాడిన బీఆర్ఎస్, ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న భారీ విద్యుత్ కుంభకోణాన్ని (Power Scam) రట్టు చేయడానికి సిద్ధమైంది. రామగుండం, పాల్వంచ, మక్తల్ పవర్ ప్లాంట్ల పేరిట అక్షరాల రూ.50 వేల కోట్ల భారీ దోపిడీ జరుగుతోందని, ఇందులో ఏకంగా 40 శాతం కమీషన్లు చేతులు మారుతున్నాయని హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. అసలు కేబినెట్ సమావేశాలు ప్రజా విధానాల కోసం కాకుండా, కేవలం వాటాల పంపకాల కోసమే జరుగుతున్నాయని ఎద్దేవా చేశారు.
"ప్రతి మిషన్ వెనుక కమీషన్!"
సీఎం రేవంత్ రెడ్డి తీరును విమర్శిస్తూ.. "ఈ ప్రభుత్వం చేపట్టే ప్రతి పనిలో ఒక మిషన్ ఉంటుంది.. ఆ మిషనే కమీషన్" అని హరీష్ రావు సెటైర్లు వేశారు. ఎన్టీపీసీ (NTPC) సంస్థ తక్కువ ధరకే విద్యుత్ ఇస్తామని లేఖ రాసినా, ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ తక్కువ ధర ఆఫర్‌ను కాదని, ఎక్కువ ఖర్చుతో సొంతంగా ప్లాంట్లు కట్టడం వెనుక ఆంతర్యం కమీషన్లేనని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ హరీష్ రావు పలు కీలక ప్రశ్నలు సంధించారు:
సంక్షేమ పథకాలకు డబ్బుల్లేవని చెబుతూనే, 2,400 మెగావాట్ల ప్లాంట్లను డబుల్ కాస్ట్తో (రెట్టింపు ఖర్చుతో) ఎందుకు నిర్మిస్తున్నారు?
గతంలో దామరచర్ల ప్లాంట్‌ను విమర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇప్పుడు కమీషన్ల కోసమే నోరు మెదపడం లేదా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 'రామ్-రెమో' (అపరిచితుడు సినిమా తరహాలో) లాగా రోజుకో మాట ఎందుకు మారుస్తున్నారు?
కాంగ్రెస్ వస్తే అరాచకం వస్తుందని కేసీఆర్ చెప్పిన మాటలు ఇప్పుడు నిజమవుతున్నాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చాలు డర్టీ పాలిటిక్స్ చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

