పాకిస్థాన్‌లోని ఆ ప్రాంతం మళ్లీ భారత్‌లో కలుస్తుందా? రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ఆ ఒక్క వ్యాఖ్య ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చకు దారితీసింది!
పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతం భవిష్యత్తులో ఏదో ఒక రోజు తిరిగి భారతదేశంలో విలీనం అయ్యే అవకాశం ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌కు వెళ్లిన సింధ్‌తో, భారత్‌కు ఎప్పటికీ విడదీయరాని నాగరికత, సాంస్కృతిక అనుబంధం ఉందని ఆయన గుర్తుచేశారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన సింధీ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
"సరిహద్దులు మారొచ్చు.. సింధ్ మనదే!"
"భౌగోళికంగా సింధ్ ఇప్పుడు మనతో లేకపోయినా, నాగరికత పరంగా అది ఎప్పుడూ మనదే. చరిత్రలో దేశాల సరిహద్దులు ఎన్నోసార్లు మారాయి. రేపు సింధ్ మళ్లీ మన దేశంలో కలవదని ఎవరు చెప్పగలరు?" అని రాజ్‌నాథ్ సింగ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సింధ్ ప్రాంతానికి చెందిన బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె. అద్వానీని ఆయన గుర్తుచేసుకున్నారు. దేశ విభజనను సింధీలు మానసికంగా ఎప్పుడూ అంగీకరించలేదని అన్నారు.
పీఓకే కోసం యుద్ధం అక్కర్లేదు!
ఈ వేదికగా రాజ్‌నాథ్ సింగ్ చేసిన మరికొన్ని కీలక వ్యాఖ్యలు ఇవే:
హిందువులకు సింధు నది ఎంత పవిత్రమో, అక్కడి ముస్లింలు కూడా ఆ నదిని మక్కాలోని 'జమ్ జమ్' నీటితో సమానంగా చూస్తారని అద్వానీ రాసిన విషయాన్ని గుర్తుచేశారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారత్‌లో విలీనం కావడానికి ఎలాంటి సైనిక చర్య అవసరం లేదు.
పీఓకే ప్రజలే స్వయంగా పాకిస్థాన్ పీడన నుంచి విముక్తి కావాలని కోరుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా మాట్లాడుతూ, సింధీ సమాజం తమ సేవ, సాంస్కృతిక వారసత్వంతో దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు.

