ఆదివారం ఒక్కరోజే లక్షలాది మంది ఫోన్లకు ఆ మెసేజ్ వచ్చింది. అది క్లిక్ చేసిన వాళ్ల అకౌంట్లు ఖాళీ అయ్యాయి.. మంత్రులు, సీఎంఓ గ్రూపులు కూడా దీని బారిన పడ్డాయి!
తెలంగాణలో సైబర్ నేరగాళ్లు ఆదివారం నాడు బీభత్సం సృష్టించారు. బ్యాంకులకు సెలవు దినం కావడంతో ఇదే అదునుగా భావించి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) పేరుతో లక్షలాది మందికి నకిలీ వాట్సాప్ సందేశాలు పంపారు. "ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోకపోతే, మీ ఎస్బీఐ ఖాతా నిలిచిపోతుంది" అని భయపెడుతూ, దాని కింద 'ఎస్బీఐ ఆధార్ అప్‌డేట్ యాప్' పేరుతో ఒక ఏపీకే (APK) ఫైల్ లింక్‌ను జతచేశారు. ఇది నిజమైన బ్యాంక్ మెసేజ్ అని నమ్మిన చాలా మంది, ముఖ్యంగా టెక్నాలజీపై అవగాహన లేని సీనియర్ సిటిజన్లు ఆ లింక్ క్లిక్ చేసి నిండా మునిగారు.
ఒక్క క్లిక్.. ఫోన్ హ్యాక్!
ఆ లింక్ ద్వారా వచ్చిన యాప్‌ను ఇన్‌స్టాల్ చేసిన వెంటనే ఫోన్ పూర్తిగా హ్యాకర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. ఈ మాల్‌వేర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు:
ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, యూజర్ కంట్రోల్ కోల్పోతాడు.
ఫోన్‌లోని ఓటీపీలు, ఎస్ఎంఎస్‌లు, యూపీఐ పిన్‌లు నేరుగా హ్యాకర్లకు చేరిపోతాయి.
బాధితుల ఫోన్ నుంచే వారి కాంటాక్టులకు డబ్బు అడుగుతూ మెసేజ్‌లు వెళ్తున్నాయి.
నిమిషాల వ్యవధిలోనే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతున్నాయి.
మంత్రుల గ్రూపుల్లోకి కూడా..
ఈ సైబర్ దాడి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఒక జర్నలిస్టుకు వచ్చిన మెసేజ్ క్లిక్ చేయడంతో, ఆయన ఫోన్‌లోని మంత్రులు, సీఎంఓ వాట్సాప్ గ్రూపుల్లోకి కూడా ఈ వైరస్ సులభంగా చొరబడింది. హ్యాకర్లు అనేక గ్రూపుల అడ్మిన్లను కంట్రోల్ తీసుకుని, వాటి డీపీలను ఎస్బీఐ లోగోతో మార్చేయడం తీవ్ర కలకలం రేపింది.

