మార్కులు తగ్గాయని ఒకరు.. స్కూల్‌కు వెళ్లలేదని మరొకరు! మన పిల్లలు ఎందుకింత బలహీనంగా మారుతున్నారు? ఈ గణాంకాలు చూస్తే భయమేస్తుంది.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద ఘటనలు తల్లిదండ్రుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. లెక్కల్లో మార్కులు తగ్గాయని తండ్రి మందలిస్తే పదో తరగతి విద్యార్థిని, ఇంకా స్కూల్‌కు రెడీ కాలేదని తల్లిదండ్రులు కోప్పడితే ఎనిమిదో తరగతి బాలుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇవి కేవలం రెండు కుటుంబాల విషాదం కాదు, దేశవ్యాప్తంగా నెలకొన్న భయానక పరిస్థితికి అద్దం పడుతున్నాయి.
జాతీయ నేర గణాంకాల విభాగం (ఎన్‌సీఆర్‌బీ) ప్రకారం, దేశంలో ప్రతి 42 నిమిషాలకు ఒక విద్యార్థి తనువు చాలిస్తున్నాడు. ఒకప్పుడు రైతుల ఆత్మహత్యల గురించి చర్చ జరిగేది, కానీ ఇప్పుడు విద్యార్థుల బలవన్మరణాలు ఏటా 4 శాతం చొప్పున పెరుగుతుండటం ఆందోళనకరం. గత పదేళ్లలో (2013-2023) ఇవి ఏకంగా 65 శాతం పెరిగాయి.
ఒత్తిడే అసలు శత్రువు.. గమనించాల్సినవి ఇవే!
అసలు పిల్లలు ఇంతటి కఠిన నిర్ణయాలు ఎందుకు తీసుకుంటున్నారు? దీనికి అనేక కారణాలున్నాయని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు:
ర్యాంకుల వేట: మార్కులు, ర్యాంకుల కోసం తీవ్రమైన పోటీ, కుటుంబం నుంచి వచ్చే విపరీతమైన ఒత్తిడి.
మానసిక ఆందోళన: ఆర్థిక సమస్యలు, భవిష్యత్తుపై బెంగ, కరోనా తర్వాత పిల్లల్లో పెరిగిన ఒంటరితనం.
ప్రమాద ఘంటికలు: పిల్లలు గదిలో ఒంటరిగా గడపడం, స్నేహితులకు దూరమవడం, తరచూ కోపం లేదా చిరాకు పడటం వంటివి ఆత్మహత్యకు ముందు కనిపించే తీవ్రమైన లక్షణాలు.
ఈ సమస్యను అధిగమించాలంటే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితుల్లా మెలగాలని వైద్యులు సూచిస్తున్నారు. విద్యాసంస్థలు కేవలం పాఠాలే కాకుండా, సైకలాజికల్ కౌన్సెలింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రం తెచ్చిన 'మనోదర్పణ్' సేవలను వాడుకోవడం, యోగా, వ్యాయామం ద్వారా పిల్లలను ఒత్తిడి నుంచి బయటపడేయవచ్చు.

