విజయనగరం జిల్లాలో అత్యంత దారుణమైన, అమానవీయ ఘటన కలకలం రేపింది. అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రినే కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకు.. కాలయముడిగా మారాడు. కేవలం పెన్షన్ డబ్బుల కోసం కన్నతండ్రిని అత్యంత పాశవికంగా హతమార్చాడు. ఈ ఘటన బాడంగి మండలం గొల్లాది గ్రామంలో చోటుచేసుకుంది.
పెన్షన్ డబ్బుల కోసం దారుణం
గొల్లాది గ్రామానికి చెందిన మామిడి సత్యం (62) గత కొన్నాళ్లుగా పక్షవాతం బారిన పడి మంచానికే పరిమితమయ్యాడు. కనీసం నోటి వెంట మాట కూడా రాని అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు. అతని కుమారుడు రాము (32) మద్యానికి బానిసై, తరచూ మద్యం మత్తులో కుటుంబసభ్యులను వేధిస్తుండేవాడు.
భార్యపై కోపం.. తండ్రిపై దాడి
ఈ నెల 1వ తేదీన సత్యంకు పక్షవాతం పెన్షన్ వచ్చింది. ఆ డబ్బును అతను తన కోడలు (రాము భార్య) గంగమ్మకు ఇచ్చాడు. మరుసటి రోజు సాయంత్రం, రాము మద్యం కోసం ఆ డబ్బు ఇవ్వాలని భార్యను అడిగాడు. తండ్రి మందుల కోసం ఉంచిన డబ్బు ఇవ్వనని ఆమె తేల్చి చెప్పడంతో, రాము కత్తితో భార్యపై దాడి చేసి కొట్టాడు.
కదల్లేని తండ్రిని.. అతి కిరాతకంగా!
ఈ గొడవ చూసిన తండ్రి సత్యం, మాటలు రాకపోయినా, కోడలిని బయటకు పారిపొమ్మని చేతులతో సైగ చేశాడు. ఆమె బయటకు పరుగెత్తింది. దీంతో రాము కోపం కట్టలు తెంచుకుంది. "డబ్బులు ఇవ్వకపోగా, నా భార్యను వెనకేసుకొస్తావా?" అంటూ పట్టరాని కోపంతో కదల్లేని స్థితిలో ఉన్న తండ్రిపై విరుచుకుపడ్డాడు. కత్తితో తండ్రి గొంతు కోసి, తలను వేరు చేసి అతి క్రూరంగా హత్య చేశాడు.
తల బొచ్చెలో.. నిందితుడు అరెస్ట్
అనంతరం ఆ తలను ఒక సిమెంట్ బొచ్చెలో పెట్టి, ఇంటికి కొద్దిదూరంలో పడేశాడు. తండ్రి శరీరం మంచంపై రక్తపు మడుగులో, తల లేకుండా పడి ఉండటం చూసి స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. వెతికిన తర్వాత తల లభించింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న రామును అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు.
కుటుంబాన్ని పోషించాల్సిన కొడుకే, కేవలం పెన్షన్ డబ్బుల కోసం, మద్యం మత్తులో తండ్రిని హతమార్చడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అమానవీయ ఘటన ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసింది.
