"35 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ ఉద్యోగం పోయింది.. చేతిలో చిల్లిగవ్వ లేదు!" ఓ భారతీయ టెక్కీ సోషల్ మీడియాలో పంచుకున్న ఈ ఆవేదన ఇప్పుడు అందరి కళ్లు తెరిపిస్తోంది. లక్షల జీతాలు తీసుకుంటున్నా, ఆర్థిక ప్రణాళిక (Financial Planning) లేకపోతే జీవితం ఎంత భయానకంగా మారుతుందో ఈ ఘటన కళ్లకు కడుతోంది.
ఒకవైపు ఈఎంఐలు, మరోవైపు పిల్లల స్కూల్ ఫీజులు.. కానీ చేతిలో ఉద్యోగం లేదు, బ్యాంకులో సేవింగ్స్ లేవు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులందరికీ ఒక హెచ్చరికలా మారింది.
"ఆశావాదం బిల్లులు కట్టదు కదా.."
కంపెనీలో కాస్ట్ కటింగ్ (ఖర్చుల తగ్గింపు) పేరుతో తనను తొలగించారని సదరు టెక్కీ వాపోయారు. తన పరిస్థితిని వివరిస్తూ ఆయన రాసిన మాటలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి.
సేవింగ్స్ నిల్: "నాకు 35 ఏళ్లు. జాబ్ పోయింది. భయానకమైన విషయం ఏంటంటే.. నా దగ్గర ఎలాంటి పొదుపు (Savings) లేదు."
కుటుంబ బాధ్యతలు: "ఇద్దరు పిల్లలున్నారు. వారి స్కూల్ ఫీజులు చాలా ఎక్కువ. ఇంటి అద్దె, ఈఎంఐలు, నిత్యావసర ఖర్చులు ఆగవు.. కానీ నా జీతం మాత్రం ఆగిపోయింది."
నిద్రలేని రాత్రులు: "కుటుంబం ముందు ధైర్యంగా నటిస్తున్నా.. కానీ రాత్రుళ్లు నిద్రపట్టడం లేదు. అందరూ అన్నీ సర్దుకుంటాయని చెబుతున్నారు. కానీ ఆశావాదం (Optimism) కరెంట్ బిల్లులు, స్కూల్ ఫీజులు చెల్లించదు కదా" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
జాబ్ మార్కెట్ కఠినం.. నెటిజన్ల మద్దతు
వచ్చే ఏడాది నుంచి లైఫ్ సెటిల్ అవుతుందని అనుకున్నానని, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం బయట జాబ్ మార్కెట్ చాలా దారుణంగా ఉందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడం లేదని చెప్పారు.
ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. "మీ బాధ అర్థం చేసుకోగలం.. ధైర్యంగా ఉండండి" అని కొందరు, "ఎమర్జెన్సీ ఫండ్ (Emergency Fund) ఎందుకు ముఖ్యమో ఈ ఘటన చెబుతోంది" అని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్, సేవింగ్స్ విషయంలో ఇకనైనా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

