తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న హైటెన్షన్‌కు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. కారు దిగి హస్తం గూటికి చేరిన ఆ ఐదుగురు ఎమ్మెల్యేల భవిష్యత్తు (Future) ఏంటనేది ఈరోజు తేలిపోనుంది.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నేడు తుది తీర్పు వెల్లడించనున్నారు. ఈరోజు (బుధవారం) మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన తన నిర్ణయాన్ని ప్రకటించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఆ ఐదుగురు వీరే..
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు వీరే:
అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి)
తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం)
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి (గద్వాల్)
ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్)
గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్ చెరు)
వీరిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, నిర్ణీత గడువులోగా చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. తీర్పు సమయం దగ్గరపడుతుండటంతో ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులకు ఇప్పటికే నోటీసులు అందాయి. స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

