ఏపీ ప్రజలకు అలర్ట్! రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు త్వరలోనే మారిపోనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. ఇకపై సచివాలయాలను కొత్త పేరుతో పిలవనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పాలనా సౌలభ్యం కోసం గత ప్రభుత్వం తీసుకొచ్చిన 'గ్రామ, వార్డు సచివాలయాల' (Grama/Ward Sachivalayam) పేరును మార్చాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం సచివాలయంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. సచివాలయాలను ఇకపై 'స్వర్ణ గ్రామం' (Swarna Gramam)గా మారుస్తామని వెల్లడించారు.
స్వర్ణాంధ్ర విజన్ లో భాగమే..
ఈ పేరు మార్పు వెనుక పెద్ద ప్లానే ఉంది.
విజన్-2047: రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం రూపొందించిన 'స్వర్ణాంధ్ర విజన్-2047' సాకారంలో సచివాలయాలను కీలక పాత్రధారులుగా మార్చనున్నారు.
విజన్ యూనిట్లు: ఈ సచివాలయాలను కేవలం సేవలకే పరిమితం చేయకుండా.. 'విజన్ యూనిట్లు'గా వినియోగించుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
మూడు అంచెల వ్యవస్థ..
గతంలో వైఎస్ జగన్ హయాంలో ఈ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటైంది. అయితే, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక ఇందులో పలు సంస్కరణలు చేపడుతోంది.
కొత్త స్ట్రక్చర్: జిల్లా, మండలం, గ్రామ స్థాయిలో మూడు అంచెల వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఉద్యోగులకు మేలు: సచివాలయ ఉద్యోగులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను కూడా ప్రభుత్వం చేపడుతోంది.

