తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు అలర్ట్! మీరు కష్టపడి కట్టిన లోన్ డబ్బులు బ్యాంకుకు చేరుతున్నాయా? లేక మధ్యవర్తుల జేబుల్లోకి వెళ్తున్నాయా? ఈ సందేహాలకు చెక్ పెడుతూ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.
తెలంగాణలో మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం 'స్త్రీనిధి' (Stree Nidhi) ద్వారా రూ. 1 లక్ష నుంచి రూ. 3 లక్షల వరకు రుణాలు అందిస్తోంది. అయితే, ఈ లోన్ల రీపేమెంట్ విషయంలో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు తాజాగా 'మన స్త్రీనిధి' (Mana Stree Nidhi) అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మధ్యవర్తుల మోసాలకు చెక్!
సాధారణంగా సంఘం సభ్యులు బ్యాంకుకు వెళ్లే తీరిక లేక.. గ్రామాల్లో 'గ్రామదీపిక'లకు, పట్టణాల్లో 'ఆర్పీ' (RP)లకు ఈఎంఐ డబ్బులు ఇస్తుంటారు. అయితే, కొందరు సిబ్బంది ఆ డబ్బును బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకుంటున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. అధికారులు ఇంటికి వచ్చి అడిగేదాకా తాము మోసపోయామని మహిళలకు తెలియడం లేదు. ఈ సమస్యకు పరిష్కారమే ఈ కొత్త యాప్.
'మన స్త్రీనిధి' యాప్ ప్రయోజనాలు:
ఇకపై మీరు ఎవరి చేతికో డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. ఈ యాప్ ద్వారా మీ లోన్ చిట్టా మొత్తం మీ చేతిలోనే ఉంటుంది.
పారదర్శకత: మీరు ఎంత లోన్ తీసుకున్నారు? ఇప్పటి వరకు ఎంత కట్టారు? ఇంకా ఎన్ని వాయిదాలు ఉన్నాయి? అనే వివరాలన్నీ ఇందులో కనిపిస్తాయి.
డైరెక్ట్ పేమెంట్: మధ్యవర్తి అవసరం లేకుండా ఇంటి నుంచే నేరుగా ఆన్‌లైన్‌లో ఈఎంఐ చెల్లించవచ్చు.
యాప్ ఎలా వాడాలి?
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం చాలా సులభం.
డౌన్‌లోడ్: ముందుగా గూగుల్ ప్లే స్టోర్‌కి వెళ్లి 'Mana Stree Nidhi' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
లాగిన్: మీ రిజిస్టర్డ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేయగానే, మీ సంఘం మరియు మీ లోన్ వివరాలు స్క్రీన్ మీద వస్తాయి.
చెల్లింపు: 'మనస్త్రీనిధి తెలంగాణ' అని టైప్ చేస్తే ఆ నెల కట్టాల్సిన వాయిదా మొత్తం కనిపిస్తుంది. అక్కడే పేమెంట్ చేసేయొచ్చు.
గమనిక: ఒకవేళ యాప్‌లో మీ వివరాలు రాకపోతే, మీ ఫోన్ నంబర్ అప్‌డేట్ కాలేదని అర్థం. వెంటనే సంబంధిత అధికారులను కలిసి నంబర్ లింక్ చేయించుకోండి.

.webp)