నర్సింగ్ చదివిన వారికి జర్మనీ రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఏకంగా నెలకు రూ. 3 లక్షల వరకు జీతం తీసుకునే అద్భుత అవకాశం ఇది. ప్రైవేట్ ఏజెంట్ల చుట్టూ తిరిగి డబ్బులు పోగొట్టుకోకుండా.. ప్రభుత్వమే ఉచితంగా శిక్షణ ఇచ్చి మరీ విదేశాలకు పంపుతోంది.
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) విశాఖపట్నం విభాగం నిరుద్యోగ నర్సులకు గుడ్ న్యూస్ చెప్పింది. జర్మనీలో నర్సులకు భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. మన విద్యార్థులను అక్కడికి పంపేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం (GNM) పూర్తి చేసిన వారికి జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.
అర్హతలు - వివరాలు
విశాఖపట్నం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి చాముండేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం:
అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్ఎం (GNM) పూర్తి చేసి ఉండాలి.
ఎవరు అర్హులు: ఎస్సీ (SC), ఎస్టీ (ST) సామాజిక వర్గాలకు చెందిన మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వయసు: 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
నెలకు రూ. 3 లక్షల జీతం..
ఎంపికైన అభ్యర్థులకు జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలు ఉంటాయి. నెలకు సుమారు రూ. 2.40 లక్షల నుంచి రూ. 3.10 లక్షల వరకు జీతం లభిస్తుంది. అయితే జర్మనీ వెళ్లాలంటే అక్కడి భాష (German Language) రావడం తప్పనిసరి. వీసా పొందాలంటే కనీసం 'బీ1' (B1) స్థాయి సర్టిఫికెట్ ఉండాలి.
ఉచిత శిక్షణ - వసతి
అభ్యర్థులకు భాషా సమస్య రాకూడదని ప్రభుత్వమే ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
శిక్షణ: ఎంపికైన వారికి ఆరు నెలల పాటు జర్మన్ భాషలో ఉచిత ట్రైనింగ్ ఇస్తారు.
వసతి: విశాఖపట్నంలోని మధురవాడ (పరదేశీపాలెం) సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో వసతి ఏర్పాటు చేశారు.
ప్రైవేట్ కంపెనీల మోసపూరిత ప్రకటనలు నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ సంస్థ ద్వారానే వెళ్లడం ఉత్తమమని అధికారులు సూచిస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 90301 08030 నంబర్‌ను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

