పాకిస్థాన్‌కు శని పట్టినట్లుంది! ఒకవైపు పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సింధు జలాలను ఆపేస్తోంటే.. మరోవైపు అఫ్గనిస్థాన్ ‘పులి మీద పుట్ర’లా మరో బాంబు పేల్చింది. దాయాది దేశానికి జీవనాధారమైన కునార్ నది (Kunar River) నీటిని మళ్లించేందుకు తాలిబన్ ప్రభుత్వం సిద్ధమైంది.
పహల్గామ్ ఘటన తర్వాత భారత్ సింధు జలాలను పరిమితం చేయడంతో ఇప్పటికే పాకిస్థాన్ విలవిలలాడుతోంది. ఇప్పుడు అఫ్గనిస్థాన్ తీసుకున్న నిర్ణయం పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కునార్ నది నీటిని మళ్లించే భారీ ప్రాజెక్టుకు తాలిబన్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అఫ్గన్ ప్రధాని కార్యాలయం పరిధిలోని ఆర్థిక కమిషన్.. ఈ నీటిని నంగర్‌హార్‌లోని దారుంతా డ్యామ్‌కు (Darunta Dam) మళ్లించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఖైబర్ పఖ్తుంఖ్వా ఎడారిగా మారుతుందా?
ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అఫ్గనిస్థాన్‌లోని నంగర్‌హార్ ప్రాంత రైతులకు సాగునీరు అందుతుంది. కానీ, పాకిస్థాన్‌కు మాత్రం ఇది కోలుకోలేని దెబ్బ.
ఎడారి ముప్పు: పాక్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా (Khyber Pakhtunkhwa) ప్రాంతం పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉంది.
నది ప్రవాహం: హిందూ కుష్ పర్వతాల్లో పుట్టే కునార్ నది.. అఫ్గన్ గుండా ప్రవహించి, చివరకు పాక్‌లోకి ప్రవేశించి సింధు నదిలో కలుస్తుంది.
జీవనాధారం: పాక్‌లో వ్యవసాయం, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తికి ఈ నదే కీలకం. ఇప్పుడు దీనికి అడ్డుకట్ట పడితే అక్కడ కరువు తాండవించడం ఖాయం.
ఒప్పందం లేదు.. ఆపడం కష్టం!
ఇక్కడ పాకిస్థాన్‌కు మరో చిక్కు వచ్చి పడింది. భారత్‌తో 'సింధు జలాల ఒప్పందం' (Indus Water Treaty) ఉంది కాబట్టి ఎంతో కొంత మాట్లాడే ఛాన్స్ ఉంది. కానీ, అఫ్గనిస్థాన్‌తో పాక్‌కు ఎలాంటి నీటి పంపకాల ఒప్పందం లేదు. దీంతో తాలిబన్లను అడ్డుకోవడం ఇస్లామాబాద్ వల్ల కావడం లేదు. పైగా ఈ ప్రాజెక్టుకు భారత్ మద్దతు ఇస్తుండటం గమనార్హం.
సరిహద్దుల్లో హైటెన్షన్
ఇప్పటికే సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. తెహ్రిక్ తాలిబన్ పాకిస్థాన్ (TTP) మిలీషియా దాడులు, పాక్ సైన్యం వైమానిక దాడులతో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. ఇప్పుడు ఈ 'నీటి యుద్ధం'తో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది.

