విశాఖపట్నం ఇక లోకల్ కాదు.. గ్లోబల్! దేశంలోని నగరాలతో కాదు, ప్రపంచంతోనే పోటీ పడుతోంది. ఏపీ ఐటీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు విశాఖ వాసుల్లో, ఐటీ ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
విశాఖపట్నం మధురవాడలో ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ (Cognizant) తన శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పాల్గొన్న మంత్రి లోకేశ్.. విశాఖను రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఒక 'పవర్‌హౌస్'గా మారుస్తామని స్పష్టం చేశారు. కాగ్నిజెంట్ రాకతో విశాఖ ముఖచిత్రం మారిపోనుందని, ఇది చారిత్రక మైలురాయి అని అభివర్ణించారు.
రూ. 1500 కోట్లు.. 25 వేల ఉద్యోగాలు!
కాగ్నిజెంట్ సంస్థ రాకతో విశాఖలో కొత్త టెక్ శకం మొదలైందని లోకేశ్ అన్నారు. ఈ ప్రాజెక్టు హైలైట్స్ ఇలా ఉన్నాయి:
పెట్టుబడి: సుమారు రూ. 1500 కోట్ల భారీ పెట్టుబడితో కాగ్నిజెంట్ ఇక్కడ కార్యకలాపాలు సాగించనుంది.
ఉద్యోగాలు: మొదట 8 వేల మందికి, భవిష్యత్తులో ఏకంగా 25 వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.
టెక్నాలజీ: ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ వంటి అత్యాధునిక సాంకేతికతలపై పని జరుగుతుంది.
ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు..
ఇప్పటికే వెయ్యి మందితో తాత్కాలిక క్యాంపస్ మొదలైందని లోకేశ్ గుర్తుచేశారు. ఇక్కడ దొరికే ప్రతి సీటు కేవలం ఉద్యోగం మాత్రమే కాదని, యువత భవిష్యత్తుకు, వారి కలలకు ఒక వేదిక అని అన్నారు. కాగ్నిజెంట్ ఉద్యోగులంతా విశాఖకు 'బ్రాండ్ అంబాసిడర్లు'గా మారాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు సృష్టించడమే తమ లక్ష్యమని, ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు 25 ఏళ్ల యువకుల్లా పనిచేస్తూ స్ఫూర్తినిస్తున్నారని లోకేశ్ కొనియాడారు.

