హైదరాబాద్‌కు సముద్రం లేదన్న లోటు తీరబోతోంది! దుబాయ్, సింగపూర్ వెళ్లకుండానే ఆ రేంజ్ మజాను మన భాగ్యనగరంలోనే ఎంజాయ్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి.
హైదరాబాద్ పర్యాటకం రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. నగరవాసులకు అంతర్జాతీయ స్థాయి అనుభూతిని పంచేందుకు ప్రభుత్వం భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఇందులో ప్రధానంగా కృత్రిమ బీచ్ (Artificial Beach), టన్నెల్ అక్వేరియం, ఫ్లయింగ్ థియేటర్ వంటివి ఉన్నాయి. ఈ మెగా ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పలు ప్రముఖ సంస్థలు నేడు ప్రభుత్వంతో ఒప్పందాలు (MoU) కుదుర్చుకోనున్నాయి.
కొత్వాల్‌గూడలో కృత్రిమ బీచ్.. ఎంట్రీ టికెట్ ఎంతంటే?
సముద్రపు అలల సవ్వడిని ఇకపై హైదరాబాద్‌లోనే వినొచ్చు. కొత్వాల్‌గూడలో దాదాపు 35 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 235 కోట్ల భారీ వ్యయంతో ఈ కృత్రిమ బీచ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. స్పెయిన్ టెక్నాలజీతో నిర్మించే ఈ బీచ్‌లో సామాన్యులు సేద తీరడంతో పాటు బోటింగ్ చేసే సౌకర్యం కూడా ఉంటుంది.
ఇక డెస్టినేషన్ వెడ్డింగ్స్ (Destination Weddings) చేసుకోవాలనుకునే వారికి ఇది బెస్ట్ స్పాట్‌గా మారనుంది. ఈ బీచ్ సందర్శనకు ప్రవేశ రుసుము సుమారు రూ. 200 వరకు ఉండొచ్చని ప్రాజెక్ట్ పార్టనర్ హరి దామెర తెలిపారు.
దుబాయ్ తరహాలో టన్నెల్ అక్వేరియం
నీటి అడుగున నడుస్తూ జలచరాలను దగ్గరగా చూసే అద్భుతమైన 'టన్నెల్ అక్వేరియం' కూడా రాబోతోంది. కెడార్ అనే సంస్థ రూ. 300 కోట్లతో దీనిని నిర్మించనుంది. అంతేకాదు, ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో, రూ. 1000 కోట్ల పెట్టుబడితో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రాన్ని (International Cultural Center) ఏర్పాటు చేయనున్నారు.
వికారాబాద్‌లో క్యారవాన్ పార్క్
పర్యాటకుల కోసం వికారాబాద్‌లో ప్రత్యేకంగా 'క్యారవాన్ పార్కు'ను ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ వాహనాల పార్కింగ్, చార్జింగ్, బస, భోజన సదుపాయాలు ఉంటాయి. మరోవైపు, ఫ్యూచర్ సిటీలో ఫ్లయింగ్ థియేటర్, పర్యాటక రంగంలో యువతకు శిక్షణ ఇచ్చేందుకు 'స్కూల్ ఆఫ్ టూరిజం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ప్రాజెక్ట్స్' (STEP)ను కూడా ప్రారంభించనున్నారు.

