భారత సైన్యం తన అమ్ములపొదిలో మరో వజ్రాయుధాన్ని చేర్చుకోనుంది. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించేలా రూ. 5,000 కోట్లతో పక్కా లోకల్ డ్రోన్లను కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. ఇందులో చైనా పార్ట్స్ లేకుండా జాగ్రత్త పడటం విశేషం.
ఆత్మనిర్భర్ భారత్ స్ఫూర్తితో భారత సైన్యం (Indian Army) కీలక ముందడుగు వేసింది. సుమారు రూ. 5,000 కోట్ల విలువైన అత్యాధునిక డ్రోన్లను దేశీయంగా కొనుగోలు చేయనుంది. గతంలో 'ఆపరేషన్ సిందూర్' సమయంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, శత్రువుల జామింగ్, స్పూఫింగ్ (Electronic Warfare) టెక్నాలజీని తట్టుకునేలా వీటిని డిజైన్ చేస్తున్నారు.
చైనా పార్ట్స్ ఉంటే.. నో ఎంట్రీ!
ఈ ప్రాజెక్టులో సైన్యం ఒక కఠిన నిబంధన విధించింది. డ్రోన్ల తయారీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చైనా విడిభాగాలు (Chinese parts) వాడకూడదని స్పష్టం చేసింది. కేవలం భారతీయ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు మాత్రమే ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించింది.
మూడు రకాల డ్రోన్లు.. మూడంచెల రక్షణ!
సైన్యం ప్రధానంగా మూడు రకాల డ్రోన్ల కోసం ఆర్డర్లు ఇవ్వనుంది:
కామికేజ్ (Kamikaze): తక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై నేరుగా వెళ్లి ఢీకొట్టి పేలిపోయే డ్రోన్లు (Loitering Munitions).
ప్రెసిషన్ డ్రోన్లు: సుదూర లక్ష్యాలను గుర్తించి, వాటిని ధ్వంసం చేసి తిరిగి వెనక్కి రాగల సామర్థ్యం ఉన్నవి.
నిఘా డ్రోన్లు: సరిహద్దుల్లో శత్రువుల కదలికలను ఎప్పటికప్పుడు పసిగట్టే యూఏవీలు (UAVs).
కఠిన పరీక్షల్లో పాస్.. రూ. 500 కోట్ల డీల్!
ఈ డ్రోన్ల ఎంపిక కోసం సైన్యం ప్రత్యేకంగా ఒక 'ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ టెస్టింగ్ జోన్'ను ఏర్పాటు చేసింది. ఎత్తైన పర్వత ప్రాంతాల్లో, తీవ్రమైన జామింగ్ నడుమ వీటిని పరీక్షించింది. ఈ టెస్టుల్లో సత్తా చాటిన ప్రభుత్వ రంగ సంస్థ 'మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్' ఇప్పటికే రూ. 500 కోట్ల విలువైన కాంట్రాక్టును దక్కించుకోవడం విశేషం.

