కర్ణాటక పాలిటిక్స్ ఇప్పుడు 'డిన్నర్' చుట్టూ తిరుగుతున్నాయి! ఒకపక్క సీఎం సీటు మారుతుందన్న ప్రచారం.. మరోపక్క డీకే శివకుమార్ సీక్రెట్ విందులు.. అసలేం జరుగుతోంది?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ప్రచారం జోరందుకున్న వేళ గురువారం రాత్రి ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) తన వర్గం బల ప్రదర్శన అన్నట్లుగా.. పలువురు ఎమ్మెల్యేలతో కలిసి డిన్నర్ చేశారు. పార్టీ నేత ప్రవీణ్ ఫామ్ హౌస్‌లో జరిగిన ఈ విందులో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు పాల్గొన్నట్లు సమాచారం.
విందులో బీజేపీ రెబల్స్!
ఈ డిన్నర్ మీటింగ్‌లో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలే కాకుండా.. బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యేలు ఎస్‌టీ సోమశేఖర్, శివరామ్ హెబ్బర్ కూడా ఇందులో పాల్గొన్నారు. దీంతో ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
నిన్న సిద్ధు.. నేడు డీకే!
ఆశ్చర్యకరంగా, దీనికి ఒక్కరోజు ముందే సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) కూడా బెళగావి నార్త్ ఎమ్మెల్యే ఫిరోజ్ నివాసంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో విందు భేటీ నిర్వహించారు.
బ్రేక్‌ఫాస్ట్ టు డిన్నర్ పాలిటిక్స్:
ఇటీవలే హైకమాండ్ ఆదేశాలతో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో కలిసి సీఎం మార్పుపై చర్చించారు.
ఇప్పుడు వరుస పెట్టి డిన్నర్ మీటింగ్స్ పెడుతుండటం చూస్తుంటే.. ఎవరి వర్గాన్ని వారు కాపాడుకునే పనిలో పడ్డారని టాక్ వినిపిస్తోంది.
అయితే, డీకే మాత్రం.. "మేం ఎమ్మెల్యే ఇంట్లో స్నేహపూర్వకంగా కలుసుకున్నాం అంతే" అని చెబుతున్నారు.

