అమెరికా కంటే సౌదీనే డేంజర్: 11 వేల మంది భారతీయులు వెనక్కి!

naveen
By -

విదేశాలకు వెళ్లి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని, కుటుంబాన్ని బాగా చూసుకోవాలని ఎవరు కోరుకోరు? కానీ ఆ ఆశల పల్లకి ఇప్పుడు అర్ధాంతరంగా కూలిపోతోంది. అమెరికాలో ట్రంప్ వచ్చాక భారతీయులను వెనక్కి పంపించేస్తున్నారని మనం రోజూ వార్తల్లో చూస్తున్నాం, భయపడుతున్నాం. కానీ అసలైన ప్రమాదం అమెరికా నుంచి కాదు, మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వెళ్లే గల్ఫ్ దేశాల నుంచే పొంచి ఉంది. 


ట్రంప్ కంటే కఠినంగా వ్యవహరిస్తూ సౌదీ అరేబియా వేల మంది భారతీయులను ఇంటికి తిప్పి పంపింది. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం బయటపెట్టిన ఈ చేదు నిజాలు ఇప్పుడు విదేశాలకు వెళ్లాలనుకునే ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడేస్తున్నాయి.


waiting at the airport with luggage after being deported from foreign countries.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. వీసా నిబంధనలు కఠినతరం చేసి, అక్రమంగా ప్రవేశించిన వారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తున్నారు. అయితే, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించిన తాజా గణాంకాలు చూస్తే అసలు షాక్ సౌదీ అరేబియా నుంచే తగిలింది.


2025లో ప్రపంచవ్యాప్తంగా 81 దేశాల నుంచి సుమారు 24,600 మందికి పైగా భారతీయులను బహిష్కరించి వెనక్కి పంపించారు. ఇందులో అందరూ అనుకుంటున్నట్లు అమెరికా టాప్ ప్లేస్‌లో లేదు. అమెరికా ఈ ఏడాది సుమారు 3,800 మంది భారతీయులను వెనక్కి పంపితే, సౌదీ అరేబియా ఏకంగా 11,000 మందిని తిప్పి పంపించి అగ్రస్థానంలో నిలిచింది. అంటే అమెరికా కంటే మూడు రెట్లు ఎక్కువగా సౌదీ మనవాళ్లపై వేటు వేసింది. వాషింగ్టన్, హూస్టన్ వంటి నగరాల నుంచి అమెరికా పంపిన వారి కంటే, రియాద్ నుంచి తిరుగు టపాలో వచ్చిన వారి సంఖ్యే ఎక్కువ.


పరిస్థితి కేవలం సౌదీ, అమెరికాలకే పరిమితం కాలేదు. మయన్మార్, మలేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వంటి దేశాలు కూడా వలసదారుల పట్ల కఠినంగా మారుతున్నాయి. మయన్మార్ సుమారు 1,600 మందిని, మలేషియా, యూఏఈలు చెరో 1,500 మందిని వెనక్కి పంపించాయి. బహ్రెయిన్, థాయ్‌లాండ్, కాంబోడియా వంటి దేశాలు కూడా వందల సంఖ్యలో భారతీయులను తిప్పి పంపాయి. ఇక ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులను కూడా వదలడం లేదు. 


యూకే నుంచి 170 మంది, ఆస్ట్రేలియా నుంచి 114 మంది విద్యార్థులు అర్ధాంతరంగా చదువు ఆపేసి ఇండియాకు రావాల్సి వచ్చింది. వీసా గడువు ముగిసినా అక్కడే ఉండటం (Overstaying), లీగల్ పర్మిట్స్ లేకుండా పనిచేయడం, యజమానుల నుంచి పారిపోవడం వంటి కారణాలే ఈ బహిష్కరణలకు ప్రధానమని ప్రభుత్వం చెబుతోంది.


గల్ఫ్ దేశాలకు వెళ్లే వారిలో ఎక్కువ మంది నిర్మాణ రంగం, గృహ పనుల కోసం వెళ్లేవారే ఉంటారు. వీరికి సరైన నైపుణ్యం లేకపోవడం, అక్కడి చట్టాలపై అవగాహన లేకపోవడం పెద్ద మైనస్ అవుతోంది. దీనికి తోడు దళారుల మోసాలు అమాయకుల పాలిట శాపంగా మారుతున్నాయి. ఎక్కువ జీతాలు ఇప్పిస్తామని నమ్మించి మయన్మార్, కాంబోడియా వంటి దేశాలకు తీసుకెళ్లి, అక్కడ వారిని సైబర్ క్రైమ్ ముఠాలకు విక్రయిస్తున్న ఘటనలు కోకొల్లలు. అక్కడ ఆ ముఠాల గుట్టు రట్టయినప్పుడు, అందులో ఇరుక్కున్న మనవాళ్లను నేరస్థులుగా పరిగణించి ఆయా దేశాలు బహిష్కరిస్తున్నాయి. 


విదేశాంగ శాఖ రాయబార కార్యాలయాల ద్వారా సహాయం చేస్తున్నప్పటికీ, సరైన ధ్రువపత్రాలు లేని వారిని కాపాడటం కష్టమవుతోంది. విదేశాలకు వెళ్లేముందు సరైన ఏజెంట్లను నమ్ముకోవడం, వీసా నిబంధనలు పాటించడం ఎంత ముఖ్యమో ఈ గణాంకాలు హెచ్చరిస్తున్నాయి.



బాటమ్ లైన్..

విదేశీ మోజులో పడి, దళారుల మాటలు నమ్మి వెళ్తే.. చివరకు మిగిలేది కన్నీళ్లే.

  1. గల్ఫ్ రూల్స్: సౌదీ వంటి దేశాలు ఇప్పుడు స్థానికులకే ఉద్యోగాలు (Saudization) అనే విధానాన్ని పాటిస్తున్నాయి. అందుకే చిన్నపాటి నిబంధన ఉల్లంఘించినా ఉపేక్షించడం లేదు. గల్ఫ్ వెళ్లేవారు అక్కడ పాత రోజుల్లా లేదని గుర్తించాలి.

  2. ఏజెంట్ వ్యవస్థ: అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. నకిలీ ఏజెంట్లు విజిట్ వీసాల మీద పంపి, అక్కడ పని దొరుకుతుందని నమ్మిస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లేక పోలీసులకు పట్టుబడి జైలు పాలవుతున్నారు.

  3. నైపుణ్యం ముఖ్యం: చేతిలో స్కిల్ ఉంటే ఏ దేశమైనా రెడ్ కార్పెట్ వేస్తుంది. ఏ పనీ రాకుండా, కేవలం కూలీ పని కోసం వెళ్తే మాత్రం ఇలాంటి తిప్పలు తప్పవు.


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!