మోదీని పొగిడితే తప్పుబట్టారు.. పార్టీ మీటింగులకు డుమ్మా కొట్టారు. ఇక కాంగ్రెస్‌తో ఆయన బంధం తెగిపోయినట్లే అని అందరూ అనుకుంటున్న సమయంలో.. సడన్‌గా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు! కాంగ్రెస్ సీనియర్ నేత, మేధావిగా పేరున్న శశి థరూర్ వ్యవహారం ఇప్పుడు హస్తం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా కాలం తర్వాత ఆయన పార్టీ గడప తొక్కడం వెనుక అసలు కథేంటి? మంచు కరిగిందా.. లేక రాజీ కుదిరిందా?
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ సమావేశానికి హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగిన కీలకమైన సీడబ్ల్యూసీ (CWC) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంటి అగ్రనేతలతో పాటు శశి థరూర్ కూడా హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఎందుకంటే, గత కొంతకాలంగా థరూర్ పార్టీ లైన్‌కు భిన్నంగా వెళ్తున్నారు. పలు సందర్భాల్లో బద్ధ శత్రువైన కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. దీంతో కాంగ్రెస్ హైకమాండ్‌కు, థరూర్‌కు మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన సీడబ్ల్యూసీ భేటీకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
శశి థరూర్ ఈ మధ్య కాలంలో పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 'ఓట్ చోర్ గడ్డీ ఛోడ్' ర్యాలీకి ఆయన గైర్హాజరయ్యారు. అంతటితో ఆగకుండా, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీల సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆయన పార్టీ మారుతారా లేక అసంతృప్తితో ఉన్నారా అనే అనుమానాలు బలపడ్డాయి.
వీటన్నింటికీ తోడు, ఇటీవల తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ఆయన స్పందించిన తీరు కాంగ్రెస్ నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. కేరళ రాజధానిలో బీజేపీ సాధించిన విజయం చారిత్రాత్మకమని, అదొక బలమైన ప్రదర్శన అని ఆయన కితాబిచ్చారు. సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీ ఎదుగుదలను ఇలా పొగడటం కాంగ్రెస్ శ్రేణులకు మింగుడు పడలేదు.
ఇలా వివిధ సందర్భాల్లో మోదీని, బీజేపీని ప్రశంసించడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం నచ్చలేదు. ఆయన వ్యవహార శైలిపై మొదట్లో మౌనంగా ఉన్న పార్టీ నాయకులు, తర్వాత మాత్రం తీవ్రంగా స్పందించారు. సిద్ధాంతాలు వేరుగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారని కొందరు బాహాటంగానే ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం కూడా ఆయన తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది.
అయితే అగ్ర నాయకులు ఎవరూ నేరుగా ఆయనపై చర్యలు తీసుకోలేదు. ఈ గ్యాప్ పెరిగిన తరుణంలో.. నేడు జరిగిన సమావేశానికి థరూర్ హాజరవడం, రాహుల్, ఖర్గేలతో కలిసి కూర్చోవడం చూస్తుంటే.. ఇరువురి మధ్య సయోధ్య కుదిరిందా? లేక పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికి థరూర్ ప్రయత్నిస్తున్నారా? అన్నది రాబోయే రోజుల్లో తెలియనుంది.
బాటమ్ లైన్..
రాజకీయాల్లో శశి థరూర్ శైలి ఎప్పుడూ భిన్నమే. ఆయన ఒక ఫక్తు రాజకీయ నాయకుడిలా కాకుండా, ఒక మేధావిలా ఆలోచిస్తారు. అదే ఆయనకు ప్లస్, అదే మైనస్.
ప్రత్యర్థిని పొగడటం తప్పు కాదు, కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు సొంత సైన్యాన్ని నిరుత్సాహపరిచేలా మాట్లాడకూడదు. థరూర్ ఈ లాజిక్ మిస్ అవుతున్నారని కాంగ్రెస్ భావిస్తోంది.
కాంగ్రెస్‌కు థరూర్ వంటి గ్లోబల్ ఇమేజ్ ఉన్న నేత అవసరం. అలాగే థరూర్‌కు జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే కాంగ్రెస్ అనే ప్లాట్‌ఫామ్ అవసరం. అందుకే ఎన్ని అలకలు వచ్చినా, మళ్లీ కలిసి పనిచేయడానికే ఇద్దరూ మొగ్గుచూపుతున్నారు. ఈ సీడబ్ల్యూసీ మీటింగ్ అదే సంకేతాన్ని ఇస్తోంది.

