Hema on Drugs Case: ఆరోపణలు వస్తేనే బ్రేకింగ్ న్యూస్ వేస్తారా? మీడియాపై నటి హేమ ఫైర్!
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ కేసులు మరోసారి తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఇటీవల రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో పోలీసులు జరిపిన దాడుల్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం బయటపడటం, అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలు ఉండటం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా ఇలాంటి డ్రగ్స్ కేసు వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన వేళ, గతంలో బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ నటి హేమ తాజాగా స్పందిస్తూ.. మీడియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
సెలబ్రిటీని కాబట్టే అలా చేశారు
గతంలో బెంగళూరు డ్రగ్స్ కేసులో తన పేరు బయటకు వచ్చినప్పుడు, తాను ఒక సెలబ్రిటీని కావడంతో మీడియా, సోషల్ మీడియా తనపై విపరీతమైన దుష్ప్రచారం చేశాయని హేమ మండిపడ్డారు. తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలను పదే పదే టీవీల్లో బ్రేకింగ్ న్యూస్‌లుగా చూపించిన వార్తా ఛానెల్స్.. చివరకు కోర్టు విచారణలో తనకు క్లీన్‌చిట్ వచ్చి నిర్దోషిగా తేలిన విషయాన్ని మాత్రం జనాలకు ఎందుకు చూపించలేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. తాను డ్రగ్స్ తీసుకోలేదని ఆ సమయంలో ఎంత మొత్తుకుని చెప్పినా ఎవరూ నమ్మలేదని, తీవ్ర నరకయాతన అనుభవించానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు కోర్టు తనకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో బిగ్ రిలీఫ్ లభించిందని పేర్కొన్నారు.
1086 పేజీల ఛార్జ్‌షీట్.. అసలు ఏం జరిగిందంటే!
అసలు ఈ వివాదం 2024 మే 19వ తేదీ రాత్రి కర్ణాటక రాజధాని బెంగళూరు ఎలక్ట్రానిక్స్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో జరిగిన రేవ్ పార్టీతో మొదలైంది. పక్కా సమాచారంతో మే 20 తెల్లవారుజామున దాడులు చేసిన పోలీసులు మొత్తం 88 మందిపై అభియోగాలు మోపారు. అందులో నటి హేమతో సహా 79 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు పేర్కొంటూ కోర్టులో ఏకంగా 1086 పేజీల భారీ ఛార్జ్‌షీట్‌ను సైతం దాఖలు చేశారు. తాను ఎలాంటి మత్తుపదార్థాలు తీసుకోలేదని ఆమె మీడియా ముందు ఎన్నోసార్లు తన బాధను వెళ్లగక్కినా, ఆమెపై విమర్శలు, వేధింపులు మాత్రం ఆగలేదు.
తట్టుకోలేక ప్రాణాలు విడిచిన కన్నతల్లి
సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత 2025 జనవరి 2న హేమ తరఫు వాదనలు విన్న బెంగళూరు కోర్టు, ఆమె డ్రగ్స్ తీసుకోలేదని గుర్తించి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ తర్వాత 2025 నవంబర్ 3న కోర్టు తుది తీర్పు వెలువరించగా, ఆ ఆర్డర్ కాపీ చేతికి అందిన తర్వాత హేమ ఒక ప్రత్యేక వీడియో ద్వారా తన నిర్దోషిత్వాన్ని ప్రపంచానికి చాటారు. అయితే, మీడియా మరియు సోషల్ మీడియా చేసిన ఈ నెగెటివ్ ప్రచారం వల్ల తన జీవితంలో తీరని లోటు మిగిలిపోయిందని హేమ కన్నీటిపర్యంతమయ్యారు. తనపై వచ్చిన అభాండాలను, ట్రోలింగ్‌ను తట్టుకోలేక, ఆ తీవ్రమైన మానసిక వేదనతోనే తన కన్నతల్లి ప్రాణాలు విడిచిందని ఆమె ఎంతో ఎమోషనల్ అయ్యారు.

