Akshay Kumar: వెంకీ మామ మూవీ రీమేక్ కు రెడీ!

naveen
By -

వెంకీ మామ మూవీ రీమేక్ కు రెడీ!

Akshay Kumar: వెంకీ మామ బ్లాక్‌బస్టర్‌పై కన్నేసిన బాలీవుడ్ కిలాడీ.. అక్షయ్ సరసన రాశీ ఖన్నా!


దక్షిణాది చిత్ర పరిశ్రమలో బ్లాక్ బస్టర్ హిట్‌లుగా నిలిచిన పలు క్రేజీ సినిమాలను బాలీవుడ్‌లో రీమేక్ చేసి సూపర్ హిట్‌లు అందుకున్న హీరోలు చాలా మందే ఉన్నారు. ముఖ్యంగా వరుస ఫ్లాపుల నుంచి బయటపడటం కోసం, మార్కెట్ నిలబెట్టుకోవడం కోసం సౌత్ బ్లాక్ బస్టర్లనే నమ్ముకుని సక్సెస్ ట్రాక్ ఎక్కిన సందర్భాలు కోకొల్లలు. ఇప్పుడు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్ సరిగ్గా ఇలాంటి ప్రయత్నానికే ముస్తాబవుతున్నట్లు బీటౌన్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. గతంలో రవితేజ ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని ‘రౌడీ రాథోడ్’గా, విజయ్ ‘తుపాకీ’ చిత్రాన్ని ‘హాలిడే’గా రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను ఆయన సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


‘సంక్రాంతికి వస్తున్నాం’ రీమేక్ కు సన్నాహాలు


గత కొంత కాలంగా సరైన కమర్షియల్ సక్సెస్‌లను సొంతం చేసుకోలేకపోతున్న అక్షయ్ కుమార్.. మరోసారి హిట్టు కోసం సౌత్ రీమేక్‌పై కన్నేశారు. 2025 సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని ఆయన హిందీలో రీమేక్ చేయబోతున్నారని తెలుస్తోంది. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా, హిట్ మెషీన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ ఫ్యామిలీ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో దాదాపు రూ.300 కోట్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐశ్వర్యా రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఓ ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఈ చిత్రాన్ని అక్షయ్ కుమార్‌తో రీమేక్ చేసేందుకు తుది చర్చలు జరుపుతోందని సమాచారం.


ఆ ప్రాజెక్టును లీక్ చేసిన రాశీ ఖన్నా


ఈ క్రేజీ రీమేక్ ప్రాజెక్టులో గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా ఒక హీరోయిన్‌గా నటించనున్నట్లు స్వయంగా ఆమే హింట్ ఇచ్చారు. రాశీ ఖన్నా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రేపు (మార్చి 19న) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ మీడియాతో మాట్లాడిన రాశీ ఖన్నా, తన బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం తాను రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నానని, త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ఒక సౌత్ బ్లాక్ బస్టర్ రీమేక్‌లో అక్షయ్ కుమార్‌తో కలిసి నటించబోతున్నానని ఆమె సంతోషంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుంది.


ఏప్రిల్ 10న భయపెట్టనున్న ‘భూత్ బంగ్లా’


ఇదిలా ఉంటే, అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ ‘భూత్ బంగ్లా’ ఏప్రిల్ 10న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఏక్తా కపూర్, శోభా కపూర్‌తో కలిసి అక్షయ్ కుమార్ స్వయంగా నిర్మించిన ఈ చిత్రానికి సీనియర్ సౌత్ డైరెక్టర్ ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్, ప్రియదర్శన్‌లది బాలీవుడ్‌లో తిరుగులేని హిట్ కాంబినేషన్ కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు కూడా విపరీతంగా ఆకట్టుకోవడంతో.. ఈసారి అక్షయ్‌కి కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ పక్కా అని విశ్లేషకులు భావిస్తున్నారు.