Flight Seat Selection: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్

naveen
By -
Flight Seat Selection


Flight Seat Selection: విమాన ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్.. ఇకపై 60 శాతం సీట్ల ఎంపిక ఫ్రీ!


విమాన ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. విమానంలో వెబ్ చెక్-ఇన్ సమయంలో సీటు ఎంచుకునేందుకు విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న అదనపు ఛార్జీల భారాన్ని తగ్గించే దిశగా పౌర విమానయాన శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. 


ప్రయాణికుల హక్కులను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం.. విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులకు ఉచితంగా అందించాలని సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ 60 శాతం సీట్లను ప్రయాణికులు తమకు నచ్చిన విధంగా ఫ్రీగా ఎంపిక చేసుకునే అవకాశం దక్కనుంది.


కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో కలిసి ఒకే బుకింగ్ నంబర్‌పై ప్రయాణించే వారు పక్కపక్కన కూర్చోవాలంటే ఇప్పటివరకు అదనపు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ, ఒకే పీఎన్ఆర్ (PNR) తో బుక్ చేసుకున్న ప్రయాణికులను వీలైనంత వరకు పక్కపక్కనే లేదా సమీప సీట్లలోనే కూర్చోబెట్టాలని కేంద్రం సూచించింది. 


దీనికి తోడు క్రీడాకారులు, కళాకారుల సౌకర్యార్థం.. క్రీడా సామగ్రి, సంగీత వాయిద్యాలను విమానాల్లో సురక్షితంగా తీసుకెళ్లే విషయంలో సంస్థలు ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. భద్రతా నిబంధనలు పాటిస్తూనే ప్రయాణికుల సదుపాయాలకు ఏమాత్రం భంగం కలగకుండా చూడాలని స్పష్టం చేసింది.


పెంపుడు జంతువులను విమానాల్లో తమ వెంట తీసుకెళ్లే విధానంపై ఇప్పటికీ సరైన స్పష్టత లేకపోవడాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. ఈ అంశంపై కూడా విమానయాన సంస్థలు తమ విధివిధానాలను స్పష్టంగా ప్రకటించాలని పేర్కొంది. అన్నింటికంటే ముఖ్యంగా, విమానాల ఆలస్యం, రద్దు లేదా బోర్డింగ్ నిరాకరించిన సందర్భాల్లో ప్రయాణికులకు పరిహారం మరియు ఇతర హక్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం హెచ్చరించింది. 


ప్రయాణికుల హక్కులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సంస్థల వెబ్‌సైట్లు, మొబైల్ యాప్‌లు, విమానాశ్రయ కౌంటర్లలో స్పష్టంగా ప్రదర్శించడంతో పాటు, స్థానిక ప్రాంతీయ భాషల్లో కూడా ఆ సమాచారం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని పౌర విమానయాన శాఖ తాజా మార్గదర్శకాల్లో వెల్లడించింది.