పూసలమ్మే పిల్ల నుంచి పాన్ ఇండియా సెన్సేషన్.. ఇప్పుడు 'లవ్ జిహాద్' ఉచ్చులో ప్రాణభయంతో నెట్టింటి స్టార్!
సోషల్ మీడియా అనేది ఒక మాయాజాలం. ఇక్కడ ఎప్పుడు ఎవరు రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోతారో, ఎప్పుడు వాళ్ళ జీవితం రోడ్డున పడుతుందో ఎవరికీ తెలియదు. ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో రోడ్డు మీద పూసలు అమ్ముకునే ఒక సాధారణ యువతి.. సోషల్ మీడియా పుణ్యమా అని రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారిపోయింది. ఆమె పేరే మొనాలిసా భోస్లే.
ఆ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఏకంగా సినిమా అవకాశాలు తలుపు తట్టాయి. కానీ, ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకముందే.. ఆమె వ్యక్తిగత జీవితం ఇప్పుడు పెను తుఫానులో చిక్కుకుంది. ఒకవైపు తన పెళ్లి చుట్టూ ముసురుకున్న 'లవ్ జిహాద్' ఆరోపణలు.. మరోవైపు తనను లైంగికంగా వేధించిన దర్శకుడిపై కన్నీళ్లతో ఆమె పెట్టిన సంచలన ప్రెస్ మీట్.. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో పెను కలకలం రేపుతున్నాయి.
కేరళలో రహస్య వివాహం.. రగులుకున్న వివాదం
మొనాలిసా భోస్లే కొద్దిరోజుల క్రితం తన ప్రాణ ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌ను కేరళలోని తిరువనంతపురంలో హిందూ సంప్రదాయం ప్రకారం అత్యంత నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అంతే.. ఈ పెళ్లిపై దర్శకుడు సనోజ్ మిశ్రా 'లవ్ జిహాద్' అంటూ ఆరోపణలు చేయడంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వివాదం అగ్గిలా రాజుకుంది.
సరిగ్గా అదే సమయంలో మొనాలిసా సొంత బంధువు విజయ్ భోస్లే కూడా రంగంలోకి దిగి, ఆమె ఇంకా మైనర్ అని, ఈ పెళ్లి చట్టబద్ధం కాదని పెద్ద అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ దారుణమైన ఆరోపణలపై మొనాలిసా దంపతులు తీవ్రంగా స్పందించారు. తాము ఇష్టపడే పెళ్లి చేసుకున్నామని, వయసు వచ్చిన తర్వాత చట్టబద్ధంగానే తమ వివాహం జరిగిందని కుండబద్దలు కొట్టారు.
మతపరమైన ఆరోపణలన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తూ, తాము ఎవరి మతాలను వారు పవిత్రంగా అనుసరిస్తామని వివరణ ఇచ్చారు. అయితే, ప్రస్తుతం బయట తమకు ప్రాణహాని ఉందని, భయాందోళనల మధ్య కేరళలోనే తలదాచుకుంటున్నామని వారు గుండెలు పగిలేలా ఆవేదన వ్యక్తం చేశారు.
డైరెక్టర్ కీచక పర్వం.. 18 ఏళ్లు కూడా నిండకముందే..
తాజాగా కొచ్చిలో ఏర్పాటు చేసిన ఒక విలేకరుల సమావేశంలో.. దర్శకుడు సనోజ్ మిశ్రాపై మోనాలిసా చేసిన సంచలన ఆరోపణలు అందరినీ ఉలిక్కిపడేలా చేశాయి. తన మొదటి సినిమా షూటింగ్ సమయంలో సనోజ్ మిశ్రా తన పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించారని, పలుమార్లు తన శరీర భాగాలను అసహ్యంగా తాకుతూ లైంగికంగా వేధించారని చెబుతూ ఆమె మీడియా ముందే భోరున విలపించారు.
"ఆ చీకటి సమయంలో నాకు కనీసం 18 ఏళ్లు కూడా నిండలేదు. ఆ చేదు అనుభవం గురించి ఇంట్లో వారికి చెబితే.. మొదటి సినిమా కదా, సర్దుకుపోవాలని వారు కూడా లైట్ తీసుకున్నారు. నాకు దిక్కుతోచక, ఎవరికీ చెప్పుకోలేక ఆ నరకాన్ని మౌనంగా భరించాను" అని మోనాలిసా కన్నీటి పర్యంతమయ్యారు. తన లొంగకపోవడం వల్లే, తనపై ఉన్న ఆ కక్షతోనే.. సనోజ్ మిశ్రా ఇప్పుడు తన పెళ్లిని కావాలని 'లవ్ జిహాద్'గా చిత్రీకరిస్తున్నాడని ఆమె కడిగిపారేశారు.
న్యాయం కోసం గొంతు విప్పిన స్టార్.. సపోర్ట్‌గా సోషల్ మీడియా
తన భర్త ఫర్మాన్ ఖాన్‌తో కలిసి ప్రెస్ మీట్‌కు హాజరైన మోనాలిసా.. తనను వేధించిన ఆ కీచక దర్శకుడిపై త్వరలోనే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయనున్నట్లు ధైర్యంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీగా ఒక వెలుగు వెలుగుతున్న ఆమె.. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ దారుణమైన వేధింపులపై గొంతు విప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీంతో మోనాలిసాకు అండగా నిలుస్తూ, ఆమెకు న్యాయం జరగాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
అసలు విషయానికొస్తే.. సినీ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి ఒక యువతిని లైంగికంగా వేధించిన కేసులో గతేడాదే సనోజ్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పాత చరిత్ర నేపథ్యంలోనే.. తాజాగా మోనాలిసా ఆయనపై చేసిన ఈ సంచలన ఆరోపణలు నూటికి నూరు శాతం నిజమే అయి ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు కూడా బలంగా భావిస్తున్నాయి. ఒక పూసలమ్మే పిల్లను స్టార్‌గా మార్చిన ఈ సమాజం.. ఇప్పుడు ఆమె కన్నీళ్లు తుడిచి న్యాయం చేస్తుందా? లేక ఈ వివాదంలో బలిచేస్తుందా? వేచి చూడాలి!
Also Read:
టాలీవుడ్లో కయాదు లోహర్ హవా.. ఆ డైరెక్టర్ సినిమాలో ఆఫర్!ధురంధర్ 2 కాంట్రవర్సీ.. సిగరెట్ సీన్‌పై మాధవన్ క్లారిటీ!
కుర్ర హీరోలకు సవాల్: బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్న మోహన్ లాల్
Akshay Kumar | ధురందర్ అడల్ట్ మూవీ.. భూత్ బంగ్లా ఫ్యామిలీ సినిమా!
Ranveer Singh Dhurandhar 2 Collections: కంటెంట్ సత్తా.. తెలుగులో ఆదరణ చూసి షాక్ లో బాలీవుడ్ మేకర్స్!

