పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధం కేవలం రెండు దేశాల మధ్య సమస్య కాదు. ఆ మంటలు మన పెట్రోల్ బంకుల దాకా వస్తాయి, మన నిత్యావసరాల ధరలను ఆకాశానికి అంటుకునేలా చేస్తాయి. ఆ యుద్ధానికి ముగింపు పలకాలని యావత్ ప్రపంచం ఆశగా ఎదురుచూస్తున్న వేళ.. ఒక ఊహించని అతిపెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. అమెరికా పంపిన శాంతి ప్రతిపాదనను ఇరాన్ ముఖం మీదే తిరస్కరించి గ్లోబల్ మార్కెట్లలో సంచలనం సృష్టించింది!
అహంకారం, అవాస్తవికత.. ఇరాన్ ఫైర్!
అమెరికా పంపిన ప్రతిపాదనలు పూర్తిగా అవాస్తవికం, అహేతుకం, మరియు మితిమీరినవి అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ యుద్ధానికి ముగింపు పలికే దిశగా టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య ఎలాంటి ప్రత్యక్ష చర్చలూ జరగలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఏమైనా సమాచార మార్పిడి జరిగినా, అది కేవలం మధ్యవర్తుల ద్వారానే జరిగిందని ఆయన తేల్చి చెప్పారు.
మేం చెప్పిందే విన్నారన్న ట్రంప్.. పాకిస్థాన్ ఎంట్రీ!
కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వర్షన్ మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికా పంపిన 15 పాయింట్ల ప్రతిపాదనలో చాలా వరకు షరతులను ఇరాన్ అంగీకరించిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్‌కు ఈ ప్రతిపాదనల ముసాయిదాను పరోక్ష చర్చల ద్వారా పంపామని ఆయన వెల్లడించారు. "వాళ్లు మా షరతులకు దాదాపుగా ఒప్పుకున్నారు.. ఎందుకు ఒప్పుకోరు?" అంటూ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగుతున్నందున అమెరికా మరికొన్ని డిమాండ్లను కూడా ముందుంచే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు.
ఇంతకీ ఆ 15 పాయింట్ల ప్లాన్‌లో ఏముంది?
అమెరికా పంపిన ఆ 15 పాయింట్ల ప్రతిపాదన అధికారికంగా బయటకు రాకపోయినా.. అందులో ఉన్నవి ఇవే అంటూ కొన్ని కీలక నివేదికలు లీక్ అయ్యాయి. ఇందులో ప్రధానంగా ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలన్నది అమెరికా ఫస్ట్ డిమాండ్. యురేనియం శుద్ధిని ఆపేయడం, శుద్ధి చేసిన అణు పదార్థాలను అప్పగించడం, నటాంజ్, ఫోర్డో, ఇస్ఫహాన్ లాంటి కీలక అణు కేంద్రాలను మూసివేయడం.. వీటన్నింటితో పాటు అంతర్జాతీయ తనిఖీలకు పూర్తిస్థాయిలో అనుమతి ఇవ్వాలని అమెరికా కఠిన షరతులు పెట్టింది.
హిజ్బుల్లా, హౌతీలకు చెక్.. హార్మూజ్ ఓపెన్!
అంతేకాకుండా, పశ్చిమాసియాలో ఇరాన్ ఆడుతున్న 'ప్రాక్సీ వార్' మోడల్‌ను పూర్తిగా వదిలేయాలని అమెరికా డిమాండ్ చేసింది. అంటే హిజ్బుల్లా, హౌతీల లాంటి ప్రాంతీయ సంస్థలకు నిధులు, ఆయుధాలు ఇవ్వడం తక్షణమే ఆపాలని తేల్చి చెప్పింది. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్ జలసంధిని ఎప్పుడూ తెరిచే ఉంచాలని షరతు పెట్టింది. ఈ చర్చలు సజావుగా సాగేందుకు సుమారు ఒక నెల రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాలని సూచించింది.
అమెరికా ఇస్తానన్న బంపర్ ఆఫర్ ఇదే!
ఇరాన్ గనక ఈ షరతులన్నీ ఒప్పుకుంటే.. అమెరికా బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలన్నింటినీ పూర్తిగా ఎత్తివేస్తామని ప్రకటించింది. పకడ్బందీ పర్యవేక్షణలో పౌర అవసరాల కోసం అణు కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మద్దతు ఇస్తామని, అలాగే భవిష్యత్తులో అకస్మాత్తుగా మళ్లీ ఆంక్షలు విధించే "స్నాప్‌బ్యాక్" (snapback) విధానాన్ని కూడా రద్దు చేస్తామని ఆఫర్ ఇచ్చింది.
ముందుంది మహా సంగ్రామం
ట్రంప్ పంపిన ఈ ప్రతిపాదనలను ఇరాన్ పచ్చిగా తోసిపుచ్చడం చూస్తుంటే.. ఇప్పట్లో ఈ యుద్ధానికి ముగింపు పడేలా కనిపించడం లేదు. ఇరాన్ తన అణు ఆస్తులను, ప్రాక్సీ మిలిటెంట్ గ్రూపులను వదులుకునే ప్రసక్తే లేదు. అటు అమెరికా తన పంతం వీడదు. ఈ మొండివైఖరి ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రమై, గ్లోబల్ ఆయిల్ సప్లై దారుణంగా దెబ్బతింటుంది. సామాన్యులు పెట్రోల్ ధరల మంటలకు సిద్ధంగా ఉండాల్సిందే అన్నది కాదనలేని కఠిన వాస్తవం!
Also Read:
ట్రంప్ మాస్టర్ స్కెచ్: ప్రపంచ చమురు మార్కెట్‌పై అమెరికా ఆధిపత్యం!ఇరాన్ యుద్ధంలో యూఏఈ జోక్యం చేసుకుంటే దుబాయ్, అబుదాబి బూడిదే!
ఏఐ దెబ్బకు ఉద్యోగాలు పోకుండా వినోద్ ఖోస్లా మాస్టర్ ప్లాన్!
అమెరికా vs ఇరాన్: పాకిస్థాన్‌లో రహస్య మంత్రాంగం వెనుక అసలు కథ!
ఏఐ మ్యాజిక్: బ్రోకర్ల ప్రమేయం లేకుండా ఇల్లు అమ్మి లక్ష డాలర్లు లాభం!

