వారం పొడవునా యంత్రంలా పనిచేసి.. 'ఆదివారం ఒక్కరోజు హాయిగా విశ్రాంతి తీసుకుందాం' అని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ, ఆ ఒక్కరోజే పేరుకుపోయిన బట్టలు ఉతకడం, ఇల్లు సర్దడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం.. ఇలా పనుల జాబితాతోనే ఇట్టే గడిచిపోతుంది. అసలైన విశ్రాంతి దొరకక, కనీసం మనకోసం మనం సమయం కేటాయించుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతుంటాం. ఈ నిరంతర పరుగుకు బ్రేక్ వేయడానికి ఫ్రెంచ్ జీవనశైలిలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. అదే.. 'ఫ్రెంచ్ సండే' (French Sunday).
ఏ పనీ చేయకుండా ఉండే కళ
ఫ్రాన్స్‌లో ఎప్పటినుంచో ఆచరణలో ఉన్న ఈ విధానం, ఇప్పుడు విదేశీయుల ద్వారా సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఫ్రెంచ్ భాషలో దీనిని "l'art de ne rien faire" అంటారు. అంటే 'ఏ పనీ చేయకుండా ఉండే కళ' అని అర్థం. మనం సాధారణంగా సెలవు రోజుల్లో కూడా ఏదో ఒక పని చేసి, రోజంతా ఉత్పాదకంగా (Productive) ఉండాలని మనకు తెలియకుండానే ఒత్తిడికి గురవుతాం. కానీ, ఫ్రాన్స్‌లో వాతావరణం దీనికి పూర్తి భిన్నంగా ఉంటుంది. అక్కడ ఆదివారం వస్తే చాలు, దుకాణాలన్నీ మూతపడతాయి. కనీసం కిరాణా సామాను కొనడానికి కూడా ఆ రోజును కేటాయించరు. అంటే ఆదివారం పూర్తిగా విశ్రాంతి కోసమే అని వారు బలంగా నమ్ముతారు.
గడియారంతో పరుగు ఆపేయండి
ఈ ఫ్రెంచ్ సండే ఉద్దేశం ఒక్కటే.. మనసు, శరీరంపై మాత్రమే దృష్టి పెట్టడం. అలారం పెట్టుకుని నిద్రలేవాల్సిన అవసరం లేదు, మీకు నచ్చినప్పుడే బద్ధకంగా నిద్రలేవండి. వేడి కాఫీ తాగుతూనో, ఇష్టమైన పుస్తకం చదువుతూనో ప్రశాంతంగా సమయం గడపండి. హడావిడి లేకుండా నెమ్మదిగా భోజనం చేస్తూ కుటుంబ సభ్యులతో కబుర్లలో మునిగిపోవాలి. ప్రతి నిమిషాన్ని ఉత్పాదకంగా మార్చాలనే ఆలోచనను పక్కనపెట్టేయండి. మీ శరీరం చెప్పే మాట వినండి.. ఆలస్యంగా నిద్రలేచినా, మళ్లీ పడుకోవాలనిపిస్తే హాయిగా కునుకు తీయండి. మీకెలాంటి పరిమితులూ లేవు.
స్మార్ట్‌ఫోన్‌కు సెలవు.. ప్రకృతితో నడక
ఈ రోజు పాటించాల్సిన అత్యంత ముఖ్యమైన నియమం.. డిజిటల్ పరికరాలకు దూరంగా ఉండటం. గంటల తరబడి స్మార్ట్‌ఫోన్‌లో స్క్రోలింగ్ చేయడం ఈ సంప్రదాయంలో అస్సలు లేదు. దీనికి బదులుగా వారు 'ఫ్లానర్' (Flâner) అనే పద్ధతిని పాటిస్తారు. ఫ్లానర్ అంటే ఎలాంటి నిర్దిష్ట గమ్యం లేకుండా, నెమ్మదిగా ఆరుబయట నడవడం. "ఈ రోజు నేను ఏ పనీ చేయలేదు, సమయం వృధా చేశాను" అనే అపరాధభావం (Guilt) లేకుండా మీ మనసును స్వేచ్ఛగా వదిలేయాలి. ఒకవేళ ఇల్లు సర్దడం లేదా స్నేహితులను కలవడం మీకు నిజంగా ఆనందాన్ని ఇస్తే, మనస్ఫూర్తిగా ఆ పనులు మాత్రమే చేయవచ్చు.
ఈ 'ఫ్రెంచ్ సండే' అనేది మన పని ఒత్తిడిని (Burnout) పూర్తిగా మాయం చేసే మంత్రదండం కాకపోవచ్చు.. రేపు రాబోయే సోమవారాన్ని అసలే ఆపలేకపోవచ్చు. కానీ, ఉరుకులు పరుగుల జీవితంలో రోజురోజుకీ పెరుగుతున్న ఒత్తిడికి ఇదొక అద్భుతమైన విరామాన్ని అందిస్తుంది. ఒక రోజైనా యంత్రంలా కాకుండా, మనిషిలా బతకడానికి.. జీవితాన్ని నెమ్మదిగా ఆస్వాదించడానికి ఈ 'ఏ పనీ చేయని కళ'ను మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం!

