ట్రాఫిక్ కష్టాలు లేవు, ఆఫీసుకు వెళ్లే హడావిడి లేదు.. హమ్మయ్య వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) భలే ఉందే అని సంబరపడుతున్నారా? అయితే ఆ నాలుగు గోడల మధ్య మీ ఆరోగ్యం ఎలా సైలెంట్ గా హరించుకుపోతోందో తెలిస్తే వణికిపోతారు!
ఆ నాలుగు గోడలే జైలుగా మారితే!
తాజాగా ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సోషల్ మీడియాలో పంచుకున్న తన వర్క్ ఫ్రమ్ హోమ్ అనుభవం ఇప్పుడు ఐటీ లోకాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆ వ్యక్తికి, ఇంటి నుంచి పని చేయడం ఇదే తొలిసారి. కానీ ఆ సౌకర్యమే ఇప్పుడు అతని పాలిట ప్రాణాంతకంగా మారింది.
ప్రతిరోజూ ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు కంటినిండా నిద్రపోతున్నా.. ఉదయం లేవగానే శరీరంలో ఏమాత్రం శక్తి ఉండటం లేదట. రోజంతా తీవ్రమైన బద్ధకం, భయంకరమైన అలసటతో మైండ్ పనిచేయక, కనీసం పనిపై కూడా దృష్టి పెట్టలేని దయనీయ స్థితికి ఆ యువకుడు చేరుకున్నాడు.
సూర్యకాంతి లేని గది.. ఆవిరవుతున్న ప్రాణాలు
ఈ దారుణమైన పరిస్థితికి అసలు కారణం అతడు పనిచేస్తున్న ఆ చీకటి గది. ఆ గదికి కనీసం ఒక్క కిటికీ కూడా లేదు, పక్కనే పొరుగింటి గోడ ఉండటంతో కనీస సహజ కాంతి లోపలికి రాదు. సూర్యరశ్మి లేని ఆ చీకటి గదిలో రోజంతా బందీ అవ్వడం వల్లే తన ఆరోగ్యం ఇలా తయారైందని ఆ యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
సూర్యకాంతి తగలకపోవడం వల్ల విటమిన్ డీ లోపం, తీవ్రమైన మానసిక ఒత్తిడి, కుంగుబాటు లాంటి భయంకరమైన సమస్యలు ముంచుకొస్తాయని వైద్య నిపుణులు ఎప్పటినుంచో నెత్తినోరు బాదుకుంటూనే ఉన్నారు. ఆ ఇంజనీర్ ఇప్పుడు సరిగ్గా అదే నరకాన్ని అనుభవిస్తున్నాడు.
ఏఐ టూల్స్.. కుప్పకూలిన జీవనశైలి
వర్క్ ఫ్రమ్ హోమ్ అతని ఫిజికల్ హెల్త్‌తో పాటు లైఫ్ స్టైల్‌ను కూడా సర్వనాశనం చేసింది. ఆఫీస్ లాగిన్ అవ్వడానికి సరిగ్గా రెండు నిమిషాల ముందు నిద్ర లేవడం, కదలకుండా స్క్రీన్ ముందు కూర్చోవడంతో శారీరక కదలికలు పూర్తిగా శూన్యమయ్యాయి.
దీనికి తోడు కోడింగ్ కోసం ఎక్కువగా ఏఐ (AI) టూల్స్ వాడటం వల్ల, ఒకప్పుడు బ్రెయిన్‌కు పదును పెట్టి పనిచేసే ఆ థ్రిల్ కూడా మిగలలేదని వాపోయాడు. మెదడుకు పని లేకపోవడం, శరీరానికి కదలిక లేకపోవడంతో పని పట్ల ఆసక్తి పూర్తిగా చచ్చిపోయిందని స్పష్టం చేశాడు.
నెటిజన్ల అలర్ట్.. నిర్లక్ష్యం చేస్తే ముప్పే!
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో తోటి ఉద్యోగులు తీవ్రంగా స్పందించారు. వెంటనే అప్రమత్తమై విటమిన్ డీ, ఐరన్ లెవెల్స్ టెస్ట్ చేయించుకోవాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి, వెలుతురు వచ్చే గదిలోకి మారాలని గట్టిగా సలహా ఇచ్చారు.
ప్రయాణ భారాన్ని తగ్గించే డబ్ల్యూఎఫ్హెచ్ నిజానికి వరం లాంటిదే అయినా, సరైన జీవనశైలి లేకపోతే అది ప్రాణాలు తీస్తుందని నెటిజన్లు హెచ్చరించారు. వెంటనే జిమ్‌కు వెళ్లడం, వ్యాయామం చేయడం ప్రారంభించాలని, అలసటను నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.
వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కంపెనీలు ఇచ్చిన సౌకర్యం.. కానీ దాన్ని మీ బద్దకానికి లైసెన్స్‌గా మార్చుకోకండి! కేవలం పడకగదికే పరిమితమై ప్రకృతికి దూరమైతే రేపు మీరు సంపాదించే లక్షల జీతం కూడా మీ ఆస్పత్రి బిల్లులకు సరిపోదు. ఆఫీస్ పని ఉన్నా సరే, రోజులో కనీసం గంటసేపు ఎండలో నడవండి, చెమట చిందించండి. కెరీర్ ఎదగాలంటే ముందు మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలన్న పచ్చి నిజాన్ని ప్రతి సామాన్యుడూ గుర్తుంచుకోవాల్సిన సమయమిది!
మీ ఆరోగ్యం, మీ ఉత్సాహం మీ చేతుల్లోనే ఉన్నాయి. నాలుగు గోడల మధ్య బందీ కాకుండా.. శారీరకంగా, మానసికంగా స్వేచ్ఛగా బతకడం నేర్చుకోండి.

