ప్రపంచం ఒకవైపు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటోందని అనుకునేలోపే.. ఆఫ్రికా ఖండంలో మరో మృత్యుఘంటిక మోగుతోంది. ఒకవైపు సముద్రంలో హంటా వైరస్ దడ పుట్టిస్తుంటే, భూభాగంపై 'ఎబోలా' మహమ్మారి జెట్ స్పీడ్‌తో విస్తరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటోంది. అసలు మందు లేని ఈ ప్రాణాంతక వైరస్ గురించి ఇక్కడ వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న మనమెందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే, గ్లోబలైజేషన్ ప్రపంచంలో ఏ భయంకరమైన వైరస్ అయినా మన దేశంలోకి అడుగుపెట్టడానికి కేవలం ఒక్క ఫ్లైట్ జర్నీ మాత్రమే పడుతుంది!
ఆఫ్రికాను వణికిస్తున్న మృత్యుశాసనం
పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే.. ఇప్పటికే ఈ ఎబోలా బారిన పడి 88 మంది ప్రాణాలు కోల్పోగా, 336 మంది ఆసుపత్రుల్లో నరకం అనుభవిస్తున్నారు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా దేశాల్లో ఈ మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తోంది.
ఏకంగా రెండు ఆఫ్రికన్ దేశాల రాజధానుల్లోకి ఈ వైరస్ అడుగుపెట్టడం, పైగా దీనికి ఎలాంటి చికిత్సా లేకపోవడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తక్షణమే 'గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటించింది. అధికారిక లెక్కల కంటే వాస్తవంగా వైరస్ తీవ్రత చాలా ఎక్కువగా ఉండటంతో ఈ సంచలన నిర్ణయం తీసుకుంది.
రక్త కన్నీరు పెట్టించే 'బుందిబుగ్యో' స్ట్రెయిన్
ఇప్పుడు వ్యాపిస్తున్న ఈ వైరస్ సాధారణమైనది కాదు. ఇది అత్యంత అరుదైన, ప్రమాదకరమైన 'బుందిబుగ్యో ఎబోలా' (Bundibugyo ebola virus) రకానికి చెందింది. మానవ చరిత్రలో 2007లో ఉగాండా, 2012లో తూర్పు కాంగోలో వచ్చిన మొత్తం కేసుల కంటే.. ఈ ఒక్క ఏడాదే అత్యధిక కేసులు నమోదు కావడం దీని తీవ్రతకు అద్దం పడుతోంది.
విపరీతమైన జ్వరం, తీవ్రమైన నిరసం, గొంతు నొప్పి, కండరాల నొప్పితో ఈ మహమ్మారి మొదలవుతుంది. క్రమంగా తలనొప్పి, వికారం, వాంతులతో పాటు బాధితుల శరీరంలో తీవ్రమైన రక్తస్రావానికి దారితీసి ప్రాణాలు తీస్తుంది.
బంగారం గనుల నుంచి మహానగరాలకు..
మొదట్లో కాంగోలోని మారుమూల మైనింగ్ ప్రాంతాలకే పరిమితమైన ఈ ఎబోలా.. మే 16 నాటికి ఇటూరి ప్రావిన్స్‌లో 336 కేసులు నమోదు చేసుకుని మహానగరాలను కబళిస్తోంది. కాంగో-ఉగాండా సరిహద్దుల్లోని బంగారు గనుల నగరమైన 'మోంగ్‌బ్వా' ఈ వినాశనానికి కేంద్ర బిందువుగా మారింది.
నిరంతరం వలస వెళ్లే కార్మికులు, స్థానికంగా ఉన్న అంతర్యుద్ధం, అభద్రతాభావం, అధికారులపై ప్రజలకు ఉన్న అపనమ్మకం వల్ల కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం అధికారులకు తలకు మించిన భారంగా మారింది. అయితే, సరిహద్దులు మూసివేస్తే ప్రజలు దొంగచాటుగా ప్రయాణించి వైరస్‌ను మరింతగా వ్యాప్తి చేస్తారని, ప్రయాణాలపై ఆంక్షలు వద్దని WHO ప్రపంచ దేశాలకు సలహా ఇచ్చింది.
ఇండియా సేఫ్.. అయినా అప్రమత్తతే ఆయుధం!
ఆఫ్రికాలో ఎబోలా కల్లోలం సృష్టిస్తున్నా.. భారతదేశంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది.
ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులపై విమానాశ్రయాల్లోనే నిశిత పరిశీలన ఉంటుందని, అన్ని ఎయిర్‌పోర్టుల్లో కఠినమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారి మనకు నేర్పిన అతిపెద్ద గుణపాఠం ఒకటే.. ఏ వైరస్‌ను మనం తేలిగ్గా తీసుకోకూడదు! ఆఫ్రికా దేశాలకు వ్యాపార, ఉపాధి నిమిత్తం వెళ్లే భారతీయులు ఇప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన విపత్కర సమయం ఇది. వైరస్ మన గడప తొక్కకముందే ప్రభుత్వాలు తనిఖీలు మరింత కఠినతరం చేయాలి. ఒక సామాన్యుడిగా గుంపుల్లో తిరగకుండా పర్సనల్ పరిశుభ్రత పాటించడమే మన చేతుల్లో ఉన్న ఏకైక బ్రహ్మాస్త్రం!

