ఢిల్లీ నుంచి బీహార్ వెళ్తున్న ఓ బస్సు ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
బులంద్‌షహర్‌లో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం బోల్తా
బులంద్‌షహర్ జిల్లాలోని జహంగీరాబాద్-బులంద్‌షహర్ రహదారిపై జానిపూర్ గ్రామం దగ్గర తెల్లవారుజామున 5:50 గంటల ప్రాంతంలో ఒక వాహనం వంతెనను ఢీకొని, బోల్తా పడి మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలవగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. బుదౌన్‌లో వివాహానికి హాజరై ఢిల్లీలోని మాలవీయ నగర్‌కు తిరిగి వెళ్తున్న పెళ్లి బృందం ఈ ప్రమాదంలో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ఆగ్రాలో ఫ్లైఓవర్ నుంచి కిందపడిన పికప్ వాహనం
ఆగ్రాలో జరిగిన మరో ఘోర ప్రమాదంలో, మామిడి పండ్లను రవాణా చేస్తున్న ఒక పికప్ వాహనం సహద్ర ఫ్లైఓవర్‌పై నియంత్రణ కోల్పోయి కింద పడింది. దురదృష్టవశాత్తు, అది నేరుగా మార్నింగ్ వాకర్స్‌పై పడటంతో నలుగురు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో వాహనం డ్రైవర్ కూడా చనిపోగా, అతని సహాయకుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.