బాలనటి సారా అర్జున్ హీరోయిన్‌గా ఎంట్రీ: రణ్‌వీర్ సింగ్‌తో 'ధురంధర్'లో జోడీ!

naveen
By -
0

 


రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తున్న 'ధురంధర్' చిత్రంతో బాలనటి సారా అర్జున్ కథానాయికగా బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. బాలనటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సారా, ఇప్పుడు హీరోయిన్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆమె సినీ ప్రయాణం, ఆసక్తికర విశేషాలు.. 

ఏడాదిన్నర నుంచే కెమెరా ముందు

బాలీవుడ్ నటుడు రాజ్ అర్జున్ కుమార్తె అయిన సారా అర్జున్, కేవలం ఏడాదిన్నర వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. ఒకసారి షాపింగ్ మాల్‌లో ఉన్న సారాని చూసి ఒక వాణిజ్య ప్రకటనా సంస్థ ప్రతినిధులు ఆమెతో యాడ్ చేయాలని సంప్రదించారు. రాజ్ అంగీకరించడంతో, సారా మొదటిసారి యాడ్‌లో మెరిసింది. ఆ మొదటి యాడ్ విజయవంతం కావడంతో, ఆమెకు వరుసగా వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశాలు దక్కాయి. దాదాపు 50కి పైగా యాడ్స్‌లో కనిపించి, మ్యాగీ, కల్యాణ్ జ్యువెలర్స్, క్లీనిక్ ప్లస్, మెక్ డొనాల్డ్స్ వంటి ప్రముఖ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్‌గా బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది.

'నాన్న'తో నటనకు గుర్తింపు

కోలీవుడ్ దర్శకుడు విజయ్ తెరకెక్కించిన ఒక వాణిజ్య ప్రకటనలో సారా రెండేళ్ల వయసులో నటించింది. అప్పుడు ఆమె అమాయకత్వం విజయ్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కొన్నేళ్ల తర్వాత, ఆయన దర్శకత్వం వహించిన 'దైవ తిరుమగళ్' (తెలుగులో 'నాన్న') చిత్రంలో ఆరేళ్ల వయసులో సారాకు అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో హీరో విక్రమ్ కుమార్తెగా ఆమె అద్భుతమైన నటన కనబరిచింది.

'నాన్న' క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు రూమ్ సన్నివేశాలు ప్రేక్షకులను కన్నీరు పెట్టించాయి. మతిస్థిమితం సరిగ్గా లేని తన తండ్రితో సారా సైగలు చేస్తూ మాట్లాడే సన్నివేశాలు ప్రేక్షకులను భావోద్వేగానికి గురి చేశాయి. ఈ సినిమా విజయం తర్వాత ఆమెకు తమిళం, హిందీ భాషల్లో వరుస అవకాశాలు వచ్చాయి. తెలుగులో 'దాగుడుమూత దండాకోర్' చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించింది.

'పొన్నియిన్ సెల్వన్'లో చిన్నప్పటి నందిని

ప్రముఖ దర్శకుడు మణిరత్నం రూపొందించిన భారీ ప్రాజెక్ట్ 'పొన్నియిన్ సెల్వన్' లో కూడా సారా అర్జున్ నటించింది. ఇందులో ఆమె నందిని (ఐశ్వర్యా రాయ్) చిన్నప్పటి పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రం తర్వాత ఆమె గురించి తెలుసుకోవడానికి సినీ ప్రియులు ఆసక్తి చూపించారు. కెరీర్ ఆరంభంలోనే 'పొన్నియిన్ సెల్వన్' వంటి భారీ ప్రాజెక్ట్‌లో నటించడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని సారా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

పారితోషికంపై వార్తలు, ఏజ్ గ్యాప్ చర్చ

సారా అర్జున్ పారితోషికం గురించి గతంలో వార్తలు వచ్చాయి. 18 ఏళ్ల వయసులోనే రూ.10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్న అత్యధిక పారితోషికం పొందిన బాలనటి అంటూ ప్రచారం జరిగింది. అయితే, ఈ కథనాలపై సారా అర్జున్ ఎప్పుడూ స్పందించలేదు.

'ధురంధర్' ఫస్ట్ లుక్ వీడియో విడుదలైన తర్వాత, రణ్‌వీర్ సింగ్, సారా అర్జున్ వయసు వ్యత్యాసం గురించి సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. సారా అర్జున్ వయసు 19 ఏళ్లు కాగా, రణ్‌వీర్ సింగ్ వయసు 40 ఏళ్లు. అంటే వారిద్దరి మధ్య దాదాపు 20 ఏళ్లకు పైగా వయసు వ్యత్యాసం ఉంది. బాలీవుడ్‌లో ఏజ్ గ్యాప్‌పై చర్చ కొత్తేమీ కానప్పటికీ, సల్మాన్ ఖాన్-రష్మిక మందన జంటతో పోలిస్తే, రణ్‌వీర్-సారా జోడీ అంతగా ఎబ్బెట్టుగా లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 'ధురంధర్' చిత్రానికి 'యురి' ఫేమ్ ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి (0)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!