క్యాబ్ డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని 2001లో వరుస హత్యలకు పాల్పడి, పోలీసులకు చిక్కకుండా 24 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న ఓ సీరియల్ కిల్లర్‌ను ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
క్యాబ్ డ్రైవర్ల హత్యలు: 24 ఏళ్ల తర్వాత నిందితుడు అరెస్ట్
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీకి చెందిన అజయ్ లాంబా అనే వ్యక్తి 2001లో నలుగురు క్యాబ్ డ్రైవర్ల హత్య కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఇతను మరో ఇద్దరితో కలిసి ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అప్పటి నుండి 2008 వరకు ఢిల్లీలోనే పోలీసుల కళ్లుగప్పి తిరిగాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా నేపాల్‌కు పారిపోయి, 2018 వరకు అక్కడే ఉన్నాడు.
నేరాల పరంపర.. తిరిగి భారత్‌కు వచ్చి
2018లో భారత్‌కు తిరిగి వచ్చిన అజయ్ లాంబా, మళ్లీ నేరాలను ప్రారంభించాడు. 2020లో ఒడిశా నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డాడు. బెయిల్‌పై బయటకు వచ్చి, 2021లో ఎన్డీపీఎస్ చట్టం కింద మరోసారి అరెస్టయ్యాడు. మళ్లీ బెయిల్‌పై విడుదలయ్యాక, 2024లో ఢిల్లీలోని ఒక జ్యువెలరీ షాపులో దోపిడీకి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు అతన్ని మరోసారి అరెస్ట్ చేశారు.
సీరియల్ కిల్లర్‌గా గుర్తింపు
ఇన్నిసార్లు అరెస్టయినప్పటికీ, అజయ్ లాంబా 2001లో నలుగురు క్యాబ్ డ్రైవర్లను హత్య చేసిన విషయాన్ని మాత్రం ఎప్పుడూ బయటపెట్టలేదు. తాజాగా, పోలీసులు అతడే ఆ సీరియల్ కిల్లర్ అని గుర్తించారు.
హత్యల తీరు..
అజయ్ లాంబా తన ఇద్దరు సహచరులతో కలిసి ఉత్తరాఖండ్‌కు క్యాబ్‌ను మాట్లాడుకునేవాడని పోలీసులు వివరించారు. అక్కడ డ్రైవర్‌ను హత్య చేసి, అతని దగ్గరున్న నగదు, నగలు లాక్కుని, క్యాబ్‌ను నేపాల్‌కు తరలించి అమ్ముకునే వారని తెలిపారు. ఇలా కేవలం ఒక సంవత్సరంలోనే నాలుగు హత్యలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఆ నలుగురిలో ఒక్కరి మృతదేహం మాత్రమే లభ్యమైందని, మిగతా మృతదేహాలు లభ్యం కాలేదని చెప్పారు. అజయ్ లాంబా గ్యాంగ్ ఇంకా ఎక్కువ మందిని హత్య చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, దర్యాప్తులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

