Ustaad Bhagat Singh: పవన్, చిరుపై హరీష్ శంకర్ కామెంట్స్

naveen
By -

పవన్, చిరుపై హరీష్ శంకర్ కామెంట్స్


Ustaad Bhagat Singh: శ్రీశ్రీ పద్యానికి ప్యాంట్, షర్ట్ వేస్తే పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ పూనకాలు తెప్పించే కామెంట్స్!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ఉగాది కానుకగా వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా రిలీజ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి ఈ చిత్రం ముస్తాబవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్.. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


చిరంజీవికి పవన్ తమ్ముడు కాదు.. కొడుకు


ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ చూసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి తనకు ఫోన్ చేసి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారని హరీష్ శంకర్ సంతోషం వ్యక్తం చేశారు. ట్రైలర్‌లోని ప్రతి షాట్‌ను మెగాస్టార్ ఎంతో నిశితంగా గమనించి మెచ్చుకున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా అందంగా ఉన్నారని చిరంజీవి మురిసిపోయారని హరీష్ వివరించారు. 


చిరంజీవి మాటలు వింటుంటే.. ఆయనకు పవన్ కేవలం తమ్ముడు మాత్రమే కాదని, ఒక కొడుకు లాంటి వాడని తనకు అనిపించిందని హరీష్ శంకర్ భావోద్వేగంగా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘గ్యాంగ్ లీడర్’, ‘రౌడీ అల్లుడు’ లాంటి భారీ మాస్ కమర్షియల్ హిట్ తీస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


శ్రీశ్రీ పద్యానికి ప్యాంట్, షర్ట్ వేస్తే..


ఇక పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి హరీష్ శంకర్ తనదైన శైలిలో ప్రశంసల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాకే దేశం గురించి, సమాజం గురించి మాట్లాడుతున్నారని చాలామంది అనుకుంటారని, కానీ అది పొరపాటని ఆయన స్పష్టం చేశారు. 'ఖుషి', 'బద్రి', 'బాలు' లాంటి పాత సినిమాల్లోని పాటల ద్వారానే పవన్ ఎప్పుడో తన సామాజిక స్పృహను చాటుకున్నారని హరీష్ గుర్తు చేశారు. 


మహాకవి శ్రీశ్రీ గారి పద్యానికి ప్యాంట్, షర్ట్ వేసి.. దానికి కాస్త పవర్ ఫుల్ ‘స్వాగ్’ అద్దితే ఆ రూపమే పవన్ కళ్యాణ్ అంటూ హరీష్ ఇచ్చిన ఎలివేషన్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తోంది. పవన్ స్క్రీన్ మీద అంత సహజంగా నటించడం వెనుక ఎంతో కష్టం ఉంటుందని, చిన్న డైలాగ్ కోసం కూడా ఆయన పదే పదే రిహార్సల్స్ చేస్తారని దర్శకుడు తెలిపారు. ఎల్లుండి (మార్చి 19న) రాబోతున్న ఈ సినిమా పవన్ అభిమానుల్లో కచ్చితంగా సరికొత్త జోష్ నింపుతుందని చిత్ర యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది.