పశ్చిమాసియా యుద్ధ భయాలతో గురువారం భారీ నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు, కేవలం 24 గంటల్లోనే అనూహ్యంగా కోలుకున్నాయి. ఈరోజు (శుక్రవారం) ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. అన్ని రంగాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆసాంతం గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. హార్ముజ్ జలసంధి సమస్యను ఇరాన్‌తో చర్చించి పరిష్కరించేందుకు ఐరోపా, జపాన్ దేశాలు సంయుక్తంగా ఏకమవ్వడమే మార్కెట్లలో సరికొత్త ఉత్సాహానికి, రికవరీకి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
పరుగులు పెడుతున్న సూచీలు.. పాతాళానికి రూపాయి
ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 839 పాయింట్లు లాభపడి 75,046 వద్ద ట్రేడవుతుండగా, జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 260 పాయింట్లు ఎగబాకి 23,362 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. అయితే, ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో ఉన్నప్పటికీ అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ మాత్రం తీవ్రంగా క్షీణించి 92.94 వద్ద రికార్డు స్థాయి కనిష్ఠానికి పడిపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది.
లాభనష్టాల్లో ఉన్న ప్రధాన రంగాలు, షేర్లు:
పవర్, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాల సూచీలు ఒక్కొక్కటి ఏకంగా 2 శాతం చొప్పున పెరగడంతో అన్ని రంగాల సూచీలు ఈరోజు లాభాల్లోనే ట్రేడవుతున్నాయి.
లాభాల్లో ఉన్నవి (Top Gainers): నిఫ్టీ-50 ప్యాక్‌లో ప్రధానంగా టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టాటా స్టీల్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), మరియు హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి.
నష్టాల్లో ఉన్నవి (Top Losers): మార్కెట్ ఇంతలా రికవరీ అయినప్పటికీ.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హిండాల్కో, ఒఎన్‌జీసీ షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని నష్టాలను చవిచూస్తున్నాయి.
20 రోజుల్లో ఆవిరైన 37 లక్షల కోట్లు
గత నెల (ఫిబ్రవరి) 28 నుంచి పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా దళాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఆశ్చర్యకరంగా ఈ వారం ప్రారంభంలో వరుసగా మూడు రోజులు దేశీయ మార్కెట్లలో లాభాలు వచ్చినప్పటికీ.. ఖతార్ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ భీకర దాడులు చేయడంతో చమురు ధరల భయంతో నిన్న (గురువారం) ఒక్కరోజే దలాల్ స్ట్రీట్‌లో రూ.7 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. మొత్తంగా గత 20 రోజుల యుద్ధ వాతావరణం కారణంగా ఇప్పటి వరకు దేశీయ మార్కెట్లలో ఏకంగా రూ.37 లక్షల కోట్ల భారీ సంపద తుడిచిపెట్టుకుపోయినట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Also Read:
Hormuz Strait Crisis: హార్ముజ్ కోసం ఆరు దేశాల కూటమి.. ఇరాన్‌కు చెక్ పెట్టేందుకు రంగంలోకి!Middle East Crisis: ఖతార్ గ్యాస్ ప్లాంట్‌పై ఇరాన్ భీకర దాడి.. భారత్‌కు తప్పని ఇంధన కష్టాలు!
Global Internet Outage Fears : సముద్ర గర్భంలో కేబుళ్ల కట్టింగ్ కు ఇరాన్ ప్లాన్.. కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితులు!
Middle East Crisis: ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు.. రంగంలోకి దిగిన ట్రంప్
Qatar vs Iran: 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. ఇరాన్ అధికారులకు ఖతార్ వార్నింగ్

