AP Politics: 'జగన్ 2.0' లో కార్యకర్తలకే పెద్దపీట.. డ్రగ్స్, మహిళలపై వేధింపుల విషయంలో చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కూటమి ప్రభుత్వం లక్ష్యంగా, ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు తీరుపై మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత దారుణంగా ఉందని ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన అధికార పార్టీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో నేరాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయని ఆయన ఆరోపించారు.
పుట్టా మహేష్‌తో మొదలై..
పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన ఏకైక ఎంపీ టీడీపీకి చెందిన పుట్టా మహేష్ అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ డ్రగ్స్ వ్యవహారం పుట్టా మహేష్‌తో మొదలైనప్పటికీ, అక్కడితో ఆగిపోలేదన్నారు. ఒక పాలకుడిగా చంద్రబాబు వ్యవహరించాల్సిన తీరు ఇది కాదని, తప్పు చేసిన వారిపై ఉక్కుపాదం మోపకపోవడం వల్లే ఇలాంటివి రిపీట్ అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదినారాయణ రెడ్డి కొడుకు డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడినా ప్రభుత్వం నుంచి ఎలాంటి యాక్షన్ (No Action) లేదని విమర్శించారు.
తప్పు చేసినా 'నో యాక్షన్'..
మహిళలపై దాడులు, అఘాయిత్యాలకు పాల్పడిన అధికార పార్టీ నేతల జాబితాను జగన్ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. బాధితులు స్వయంగా ఫిర్యాదు చేసినా కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు.
కోనేటి ఆదిమూలం ఒక మహిళపై దారుణమైన లైంగిక దాడి చేస్తే, దానిపై కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం పంచాయితీ చేసి వదిలేశారని ఆరోపించారు.
కేజీబీవీ మహిళా ప్రిన్సిపాల్‌ను వేధించిన ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై యాక్షన్ లేదు.
మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ చేసిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యేపైనా చర్యలు శూన్యం.
మంత్రి సంధ్యారాణి పీఏ, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌లు వీడియోలు, ఫోటోలతో సహా పట్టుబడినా ప్రభుత్వం వారిని కాపాడుతోందని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు మైండ్ సెట్ అదే..
ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి సీఎం చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని జగన్ విమర్శించారు. తన కుమారుడు లోకేష్ స్విమ్మింగ్ పూల్స్ వద్ద తాగి తూలుతూ అమ్మాయిలతో డ్యాన్సులు చేసినా, తన బావమరిది బాలకృష్ణ బహిరంగంగా మహిళల గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినా చంద్రబాబు సమర్థించారని గుర్తుచేశారు. చిన్నప్పుడు తాను ఇంతకంటే ఎక్కువే చేశానని గతంలో చంద్రబాబు అన్నారని, దీన్నిబట్టి ఆయన మైండ్ సెట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చని జగన్ ఎద్దేవా చేశారు. వీరికి ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచనే లేదన్నారు.
వస్తోంది 'జగన్ 2.0'.. పాదయాత్రకు సై
రాబోయే రాజకీయ ప్రణాళికల గురించి కూడా జగన్ క్లారిటీ ఇచ్చారు. "చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండేళ్లు పూర్తయింది. ఇక మిగిలింది రెండేళ్లే. ఆఖరి ఏడాది ఎలాగూ ఎన్నికల హడావిడి ఉంటుంది. ఈ మధ్యలోనే నా పాదయాత్ర కూడా ఉంటుంది" అని జగన్ ప్రకటించారు. త్వరలో రాబోతున్న 'జగన్ 2.0' వెర్షన్‌లో పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలకే పెద్దపీట వేస్తానని, వారి ద్వారానే ప్రజలకు మరింత మంచి జరిగేలా చూస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

