AP Divyanga Shakti Scheme: పవన్ కళ్యాణ్ ను కదిలించిన దివ్యాంగ యువకుడి మాటలు.. ఎమోషనల్ పోస్ట్

naveen
By -

AP Divyanga Shakti Scheme

Divyanga Shakti: ఆ యువకుడి మాటలు మర్చిపోలేను.. 'దివ్యాంగ శక్తి'పై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని దివ్యాంగుల కోసం ప్రతిష్టాత్మకంగా ‘దివ్యాంగ శక్తి’ పేరుతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని బుధవారం నాడు విజయవాడలో అట్టహాసంగా ప్రారంభించింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్ తదితరులు.. మంగళగిరి బస్ డిపో నుంచి పెనుమాక బస్టాండ్ వరకు దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ ప్రయాణంలో వారు దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్సులో ఒక యువకుడితో తాను ముచ్చటించిన విషయాలను, అనుభవాలను పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు.


మంత్రిగా కాదు, సామాన్యుడిగా విన్నాను..


"ఈ రోజు ఉదయం నేను మంగళగిరి నుంచి పెనుమాక వెళ్లే పల్లెవెలుగు బస్సు ఎక్కాను. ఒక మంత్రిగా కాదు, వారి మాటలు వినాలనుకునే ఒక సామాన్యుడిగా ప్రయాణించాను. నా దివ్యాంగ సోదరసోదరీమణులతో కలిసి కూర్చున్నాను. కొందరు పనులకు, మరికొందరు మార్కెట్‌కు, ఇంకొందరు వారి రోజువారీ పనుల నిమిత్తం వెళ్తున్నారు. బస్సు ముందుకు కదులుతుండగా.. మా మధ్య చాలా ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన సంభాషణలు జరిగాయి. వారి మాటల్లో బయటికి కనిపించని అపారమైన మానసిక స్థైర్యం నాకు కనిపించింది" అని పవన్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.


ఆ యువకుడి మాటలు నన్ను కదిలించాయి..


"ఈ ప్రయాణంలో ఒక సంభాషణ మాత్రం నా మనసులో బలంగా నాటుకుపోయింది. జేఎన్టీయూ (JNTU)లో స్పెషల్ ఎడ్యుకేటర్‌గా శిక్షణ పొందుతున్న ఒక యువకుడు నాతో అన్న మాటలను నేను అంత సులభంగా మర్చిపోలేను. ఆ యువకుడు ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్యసేన్ చెప్పిన ‘డబుల్ హ్యాండిక్యాప్’ (Double Handicap) కాన్సెప్ట్‌ను గుర్తుచేశాడు. సాధారణ ప్రజలతో సమానంగా జీవించడానికి, దివ్యాంగులు ఆర్థికంగా మోస్తున్న అదనపు భారాన్ని గురించి అతను వివరించాడు."


"ఈ ‘దివ్యాంగ శక్తి’ విధానం కేవలం ఆ ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా.. రాష్ట్రానికి, దేశానికి మా వంతు సేవ చేసే అవకాశాన్ని ఇస్తోంది. అదే ఈ పథకానికి అసలైన అర్థం అని ఆ యువకుడు చెప్పాడు. ప్రతిరోజూ తన సొంత సవాళ్లను ఎదుర్కొంటూనే, తోటి దివ్యాంగులకు సేవ చేయడానికి సిద్ధమవుతున్న ఆ యువకుడు.. దేశ నిర్మాణం గురించి ఆలోచిస్తున్న విధానం చూసి నేను అబ్బురపడ్డాను. అతని ఆలోచనా విధానం నన్ను ఎంతగానో కదిలించింది" అని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


ఇది కేవలం ప్రయాణం కాదు, ఆత్మగౌరవం..


"దివ్యాంగ శక్తి అనేది కేవలం ఒక ఉచిత రవాణా సౌకర్యం మాత్రమే కాదు. ఒక దివ్యాంగుడు ఉదయం ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు.. గమ్యానికి ఎలా చేరుకోవాలనే ఆలోచన, ఆందోళన లేకుండా ప్రయాణించగలగడం. ఈ సాధారణ ప్రయాణంలో వారికి దక్కే ఆత్మగౌరవమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. జేఎన్టీయూ యువకుడు నాకు గుర్తుచేసినట్లుగా.. అవకాశాలు కల్పిస్తే మన ప్రజలు సమాజానికి తిరిగి ఎంతగా సేవ చేయగలరో చెప్పడానికి ఇదొక పెట్టుబడి లాంటిది" అని పవన్ వివరించారు.


ప్రధాని మోదీకి, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు..


"నిజమైన సమ్మిళిత భారతదేశం (Inclusive India) పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఉన్న అచంచలమైన విశ్వాసానికి నేను కృతజ్ఞుడను. అలాగే, ఆ విశ్వాసాన్ని గ్రామాల్లో, పట్టణాల్లో, ఈరోజు నేను ప్రయాణించిన మార్గాల్లో నిజం చేయడానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు."


"మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. కానీ, ఎందుకు చేయాలో ఈరోజు నా ప్రయాణం నాకు మరోసారి గుర్తుచేసింది" అని పవన్ కళ్యాణ్ తన పోస్ట్‌ను ముగించారు.