కల్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి కున్వార్ విజయ్ షాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు పద్ధతిగా మాట్లాడాలని సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. అర్థవంతమైన మాటలు మాట్లాడాలని చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏజీ మాసిహ్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలి
రాజ్యాంగ పదవిలో ఉన్న ఇలాగేనా మాట్లాడేది అని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. దేశం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నప్పుడు కొంత సంయమనం పాటించాల్సిందని ధర్మాసనం పేర్కొంది. కల్నల్ ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మంత్రి కున్వార్ విజయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు సుమోటోగా ఆదేశించింది. ఈ క్రమంలో తనపై నమోదయ్యే ఎఫ్ఐఆర్ పై స్టే విధించాలని కోరుతూ విజయ్ షా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
మంత్రి విజయ్ షా క్షమాపణ
"రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు ఆచితూచి మాట్లాడాలి. చట్టవిరుద్ధంగా మాట్లాడొద్దు. విలువైన మాటలు మాట్లాడాలి. భారత్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు తగదు" అని జస్టిస్ బీఆర్ గవాయ్ తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు ఇదే విషయంపై విజయ్ షా స్పందిస్తూ, తన నేపథ్యం అంతా మిలటరీకి చెందినదేనని అన్నారు. కల్నల్ సోఫియా ఖురేషీ తన నిజమైన సోదరి కంటే గొప్పదని, తాను హృదయం నుండి క్షమాపణ కోరుతున్నానని, ఒక్కసారి కాదు, పదిసార్లు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు.
వివాదాస్పద వ్యాఖ్యలు
ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి విజయ్ షా మాట్లాడుతూ, కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదులు హిందువుల బట్టలు విప్పి, మతం అడిగి కాల్చి చంపారని అన్నారు. ఉగ్రవాదుల బట్టలు మనం విప్పలేకపోయాం. కాబట్టి వారి మతానికి చెందిన ఒక సోదరిని(సోఫియా ఖురేషీ) పంపించామన్నారు. మా సోదరీమణులను ఉగ్రవాదులు వితంతువులుగా మార్చారని అన్నారు. తాము పాకిస్తాన్ బట్టలు విప్పలేకపోయామని, కాబట్టి మేము వారి సంఘం నుండి ఒక కుమార్తెను పంపామంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

