Dhurandhar 2 Advance Bookings: 3 వేల టికెట్, ఫస్ట్ డే 250 కోట్లు!

naveen
By -

Dhurandhar 2 Advance Bookings

Dhurandhar 2 The Revenge: రిలీజ్‌కు ముందే రికార్డుల సునామీ.. ఒక్క టికెట్ 3 వేలు, కానీ లాస్ట్ మినిట్‌లో భారీ టెన్షన్!


బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవేటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2: ది రివెంజ్’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వద్ద పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. రేపు (మార్చి 19న) ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కానుండగా.. నేడు సాయంత్రం 5 గంటల నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున పెయిడ్ ప్రివ్యూ షోలను మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే ఒకపక్క అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు బద్దలవుతుంటే, మరోపక్క సినిమా కంటెంట్ డెలివరీలో నెలకొన్న ఆటంకాలు ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి.


సెకండ్ హాఫ్ రీ-ఎడిట్.. 5 గంటల షోలకు కంటెంట్ టెన్షన్!


ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రీమియర్స్ ప్రారంభం కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో చిత్ర బృందం సెకండ్ హాఫ్‌లో కొన్ని కీలకమైన రీ-ఎడిట్స్ చేసినట్లు తెలుస్తోంది. దీని కారణంగా సినిమా పూర్తి కంటెంట్ (KDM ఫైల్స్) ఇంకా డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్లకు (DSPs) చేరలేదని సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌తో పాటు ఇండియాలోని కొన్ని కీలక ప్రాంతాలకు సెకండ్ హాఫ్ కంటెంట్ ఇంకా అందలేదు. 


క్యూబ్ లాంటి శాటిలైట్ డెలివరీ సిస్టమ్ ఉన్న థియేటర్లకు కంటెంట్ త్వరగా చేరే అవకాశం ఉన్నా, కేవలం హార్డ్ డ్రైవ్‌లపై ఆధారపడే ప్రాంతాల్లో మాత్రం షోలు రద్దయ్యే లేదా ఆలస్యమయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దాదాపు 4 గంటల నిడివితో వస్తున్న ఈ భారీ స్పై థ్రిల్లర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల్లో సైతం వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ డెలివరీ జాప్యం వల్ల తెలుగు వెర్షన్ షోలకు అంతరాయం కలుగుతుందా లేక మేకర్స్ ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది.


ముఖం పగిలిపోయే రేట్లు.. అయినా హౌస్ ఫుల్!


మరోవైపు 'ధురంధర్ 2' టికెట్ ధరలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త చర్చకు దారితీశాయి. సాధారణంగా పెద్ద సినిమాలకు రేట్లు పెంచడం సహజమే అయినా, ఈ సినిమా ఆ హద్దులను పూర్తిగా చెరిపేసింది. దేశ రాజధాని ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్‌లో కేవలం 42 సీట్ల సామర్థ్యం ఉన్న లగ్జరీ స్క్రీన్‌లో (రీక్లైనర్ సీట్లు) ఒక్కో టికెట్ ధరను ఏకంగా ₹3,100 గా నిర్ణయించారు. బుకింగ్ ప్లాట్‌ఫామ్ ఛార్జీలు కలిపితే ఇది ఇంకా పెరుగుతుంది. ముంబైలోని బోర్విలి ఐనాక్స్‌లో కూడా ఇదే ధర పలుకుతోంది. ఇక బెంగళూరులోని డైన్-ఇన్ స్క్రీన్లలో టికెట్లు ₹2,000 నుంచి ₹2,900 వరకు విక్రయిస్తున్నారు. ఇంత భారీ స్థాయిలో రేట్లు ఉన్నప్పటికీ, నిమిషాల వ్యవధిలోనే షోస్ అన్నీ హౌస్ ఫుల్ అయిపోతుండటం రణవీర్ సింగ్ మాస్ క్రేజ్‌కు నిదర్శనం.


సౌత్ రికార్డులపై కన్నేసిన రణవీర్ సింగ్


అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లలో 'ధురంధర్ 2' ఎన్నడూ లేని విధంగా సరికొత్త సంచలనాలు సృష్టిస్తోంది. నేటి సాయంత్రం జరగబోయే ప్రీమియర్స్ ద్వారానే ఏకంగా రూ. 58.64 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాలో ఫస్ట్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్స్ కలుపుకుంటే ఈ మొత్తం రూ.197.87 కోట్లుగా ఉంది. ఇక నార్త్ అమెరికా ప్రీ-సేల్స్‌లో 34.37 మిలియన్ డాలర్ల మార్కును దాటి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈజీగా తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 250 కోట్ల ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 లాంటి తెలుగు పాన్ ఇండియా సినిమాలు మాత్రమే ఫస్ట్ డే 200 కోట్ల క్లబ్‌లో ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 గనుక రూ. 250 కోట్లు రాబడితే.. హిందీ సినిమా చరిత్రలో సౌత్ రికార్డులను బద్దలు కొట్టిన తొలి చిత్రంగా చరిత్ర సృష్టించబోతోంది.