ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసే సమయంలో ఒక్కోసారి నగదు రాకపోయినా, అకౌంట్లో నుంచి డబ్బులు కట్ అవుతుంటాయి. ఇలాంటి సాంకేతిక లోపాలను, కస్టమర్ల ఫిర్యాదులను తేలికగా తీసుకుంటే బ్యాంకులకు ఎంత భారీ మూల్యం చెల్లించుకోక తప్పదో బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) తాజా ఉదంతం నిరూపించింది. కేవలం రూ.10 వేల ఏటీఎం లావాదేవీ విఫలమైన కేసులో ఒక కస్టమర్ ఏకంగా తొమ్మిదేళ్ల పాటు చేసిన సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, సదరు బ్యాంకు ఇప్పుడు ఆ కస్టమర్‌కు అసలు మొత్తానికి ఏకంగా దాదాపు 30 రెట్లు (సుమారు రూ.3.5 లక్షలు) నష్టపరిహారంగా చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అసలు ఏం జరిగిందంటే..
సూరత్‌లోని ఉధ్నా ప్రాంతానికి చెందిన ఒక కస్టమర్ 2017 ఫిబ్రవరిలో తన బ్యాంక్ ఆఫ్ బరోడా డెబిట్ కార్డును ఉపయోగించి ఎస్‌బీఐ (SBI) ఏటీఎంలో రూ.10,000 డ్రా చేయడానికి ప్రయత్నించాడు. ఏటీఎంలో కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేయగానే స్క్రీన్ పై కేవలం ‘ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్’ అని మాత్రమే కనిపించింది. డబ్బులు రాలేదు, కనీసం రసీదు కూడా రాలేదు. కానీ కొద్దిసేపటికే అతని ఖాతాలో నుంచి రూ.10 వేలు డెబిట్ అయినట్లు ఎస్ఎంఎస్ వచ్చింది. దీనిపై ఫిబ్రవరి 21న కస్టమర్ బ్యాంక్ ఆఫ్ బరోడా డంభాల్ శాఖలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. మార్చి నుంచి మే వరకు అనేక ఈమెయిళ్లు పంపడంతో పాటు, ఆర్బీఐని, ఇతర ఉన్నతాధికారులను కూడా సంప్రదించాడు. ఎస్‌బీఐ నుంచి సీసీటీవీ ఫుటేజీ ఇవ్వాలని ఆర్టీఐ (RTI) కూడా దాఖలు చేశాడు. అయినా బ్యాంకు నుంచి ఎలాంటి స్పష్టమైన స్పందన రాలేదు.
వినియోగదారుల ఫోరం తీర్పు.. బ్యాంక్‌కు భారీ షాక్
బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన కస్టమర్, చివరకు 2017 డిసెంబర్ 20న వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేశాడు. విచారణ సమయంలో ఆ ఏటీఎం ఎస్‌బీఐకి చెందినదని, తమ రికార్డుల ప్రకారం లావాదేవీ విజయవంతమైందని, కాబట్టి తమకు ఎలాంటి బాధ్యత లేదని బ్యాంక్ ఆఫ్ బరోడా వాదించింది. అయితే, కమిషన్ ఈ వాదనను తీవ్రంగా తోసిపుచ్చింది. లావాదేవీకి సంబంధించి బ్యాంకు కచ్చితమైన రుజువులు చూపించడంలో విఫలమైందని స్పష్టం చేసింది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం విఫలమైన లావాదేవీల డబ్బును ఐదు రోజుల్లోగా కస్టమర్ ఖాతాలో వాపసు చేయాలి. అలా చేయడంలో విఫలమైతే, ఆ తర్వాత నుంచి రోజుకు రూ.100 చొప్పున కస్టమర్‌కు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
3,288 రోజుల జాప్యం.. 3.5 లక్షల నష్టపరిహారం
ఈ కేసులో బ్యాంకు డబ్బును వాపసు చేయడంలో ఏకంగా 3,288 రోజుల సుదీర్ఘ జాప్యం జరిగినట్లు కమిషన్ గుర్తించింది. దీంతో రూ.10 వేల అసలు మొత్తాన్ని 9 శాతం వార్షిక వడ్డీతో వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. అలాగే ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఆలస్యమైన ప్రతి రోజుకు రూ.100 చొప్పున.. 2026 ఫిబ్రవరి 26 నాటికి మొత్తం 3,288 రోజులకు గాను రూ.3,28,800 నష్టపరిహారం చెల్లించాలని సంచలన తీర్పునిచ్చింది. వీటికి అదనంగా కస్టమర్ అనుభవించిన మానసిక వేదనకు రూ.3,000, న్యాయపరమైన ఖర్చుల నిమిత్తం మరో రూ.2,000 చెల్లించాలని ఆదేశించింది. మొత్తంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఇప్పుడు సదరు కస్టమర్‌కు సుమారు రూ.3.5 లక్షలు చెల్లించాల్సి రావడం బ్యాంకింగ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read:
Global Internet Outage Fears : సముద్ర గర్భంలో కేబుళ్ల కట్టింగ్ కు ఇరాన్ ప్లాన్.. కోవిడ్ కంటే భయంకరమైన పరిస్థితులు!Middle East Crisis: ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు.. రంగంలోకి దిగిన ట్రంప్
Qatar vs Iran: 24 గంటల్లో దేశం విడిచి వెళ్లండి.. ఇరాన్ అధికారులకు ఖతార్ వార్నింగ్
Israel vs Iran War: ఎక్కడున్నా వదిలిపెట్టం.. మోజ్తాబా ఖమేనీకి ఇజ్రాయెల్, ట్రంప్ వార్నింగ్
Indians Evacuated: స్వదేశానికి 2.44 లక్షల మంది.. తరలింపుపై కేంద్రం కీలక ప్రకటన
Dubai Economic Crisis: కుప్పకూలుతున్న దుబాయ్ ఆర్థిక వ్యవస్థ
India Condemns Pakistan: పవిత్ర రంజాన్ మాసంలో ఈ పైశాచికం ఏంటి? పాక్ వైమానిక దాడిపై భారత్ ఫైర్

