Ustaad Bhagat Singh Release: ఉగాదికి వస్తున్న పవన్ కళ్యాణ్.. ధురంధర్ తో పోటీపై డైరెక్టర్ కామెంట్స్

naveen
By -

Ustaad Bhagat Singh Release

Ustaad Bhagat Singh: ఎడిటింగ్‌లో తీసేసింది 14 నిమిషాలే.. ‘ఉస్తాద్’పై హరీష్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బ్లాక్ బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ రేపు ఉగాది కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని హోటల్ దసపల్లాలో నిర్వహించిన గ్రాండ్ రిలీజ్ ప్రెస్ మీట్‌లో చిత్ర యూనిట్ పాల్గొని ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ వేడుకలో డైరెక్టర్ హరీష్ శంకర్, నిర్మాత నవీన్ ఎర్నేని, హీరోయిన్లు శ్రీలీల, రాశి ఖన్నాతో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చందు పాల్గొన్నారు.


ఎడిటింగ్‌లో పోయింది 14 నిమిషాలే!


వెండితెరపై ఒక స్టార్ హీరో కమర్షియల్ ఎంటర్‌టైనర్ వచ్చి చాలా కాలం అయ్యిందని, ఈ లోటును 'ఉస్తాద్ భగత్ సింగ్' భర్తీ చేస్తుందని దర్శకుడు హరీష్ శంకర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా కేవలం ఫ్యాన్స్‌కే కాకుండా సామాన్య ప్రేక్షకులకు కూడా విపరీతంగా నచ్చుతుందని ఆయన అన్నారు. సినిమా నిడివి గురించి చెబుతూ.. తాము మొత్తం 2 గంటల 58 నిమిషాల ఫుటేజ్ షూట్ చేస్తే, ఎడిటింగ్‌లో కేవలం 14 నిమిషాలు మాత్రమే తీసేశామని వెల్లడించారు. దీన్ని బట్టి సినిమాను ఎంత క్రిస్ప్‌గా, పక్కా ప్లానింగ్‌తో తీశామో అర్థం చేసుకోవచ్చని ఆయన వివరించారు. అనుకున్నది అనుకున్నట్లుగా రావడానికి పవన్ కళ్యాణ్ అంకితభావం, క్రమశిక్షణతో పాటు మైత్రీ మూవీ మేకర్స్ ఇచ్చిన అన్ కాంప్రమైజ్డ్ సపోర్ట్ ప్రధాన కారణమని ఆయన కొనియాడారు.


థమన్ ఒక హీరోలా ఆదుకున్నాడు


సినిమా రిలీజ్ డేట్ అనుకున్న సమయం కంటే ముందుకు (ప్రీ-పోన్) వచ్చిన తరుణంలో, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఒక హీరోలా బాధ్యత తీసుకుని సినిమాను ఆదుకున్నాడని హరీష్ శంకర్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బడ్జెట్ విషయంలో నిర్మాతలు ఎక్కడా వెనకడుగు వేయలేదని, ముఖ్యంగా సాంగ్స్ కోసం భారీ సెట్స్ ఏర్పాటు చేసి సినిమాను రిచ్‌గా తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఫుల్ లెంగ్త్ మాస్ అవతార్‌లో చూస్తారని, అభిమానులకు పూనకాలు ఖాయమని ఆయన హామీ ఇచ్చారు.


ఆ సినిమాతో మాకు పోటీ లేదు


ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రణవీర్ సింగ్ నటించిన భారీ స్పై యాక్షన్ చిత్రం ‘ధురంధర్ 2’ పోటీలో ఉన్నప్పటికీ, దానితో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని హరీష్ శంకర్ స్పష్టం చేశారు. ఆ సినిమా జోనర్ వేరని, 'ఉస్తాద్ భగత్ సింగ్' పక్కా తెలుగు కమర్షియల్ ఎంటర్‌టైనర్ కావడంతో కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని, కానీ సినిమా చూసే రెండు గంటల పైచిలుకు సమయం ప్రేక్షకులు మాత్రం థియేటర్లలో ఫుల్ ఎంజాయ్ చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.